Monday, April 29, 2024

Tension – వైసిపి సిట్టింగ్ లలో అయోమయం… గందరగోళం

ఏపీలో అధికార పార్టీ నేతల్లో అయోమయం, గందరగోళం గత్తర గత్తర చేస్తోంది. రాజకీయంగా తమ బతుకేమిటో అర్థం కాని స్థితిలో ఎమ్మెల్యేలు కొట్టిమిట్టాడుతున్నారు. తెలంగాణ ఎన్నికల పుణ్యమాని ఏపీ సిట్టింగ్​ల స్థితి గతి మారిపోయింది. త్వరలో ఎన్నికల భేరీ మోగనున్న తరుణంలో.. యుద్ధ బరిలో కదం తొక్కే వీర భటుల పాత్రను పోషించే కొత్త నాయకత్వానికి అధిష్టానం తెర తీసింది. ఇంతవరకూ ఎమ్మెల్యే వెంట సాహో సాహో నినాదాలు చేస్తూ.. ప్రజల్లో మమేకమై అకుంఠిత, అంకితభావంతో.. అగ్రనేతకే నీరాజనం పలికిన భటులనే సేనానులుగా అధిష్టానం గుర్తిస్తోంది.. ఐదేళ్లుగా ఎమ్మెల్యే గిరీని ఆస్వాదించిన బడాబాబులకు కాసేపు విశ్రాంతిని ఇస్తోంది. కొందరికి సీట్లు లేవు. ఇంకొందరికి బదిలీ చాన్స్. డబ్బులున్నోళ్లకి ఎంపీసీట్లు.. సీట్లు ఖాళీ చేసినోళ్లకి భవిష్యత్తులో సముచిత స్థానం.. ఇదీ అధిష్టానం సరికొత్త వ్యూహం. ఇంత వరకూ ఓకే.. ఇప్పుడే ఈ గందరగోళం వైసీపీలో అలజడి రేపింది. గుంటూరు జిల్లాలో ఈ ప్రయోగంతో మిశ్రమ స్పందన లభించినా… ఫలితంలో ఢోకా కనపడలేదు. కానీ.. సీట్లు గల్లంతు బాబుల్లో మాత్రం పైకి కనిపించని రెబలిజం చాపకింద నీరు పాత్రలో చకచక పావులు కదుపుతున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంతకీ ఏపీలో అధికార పార్టీ టిక్కెట్లాట పరిస్థితిని పరిశీలిస్తే..

సిట్టింగుల్లో అంతర్మథనం

ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమను అందించి.. 3000 రెట్లు గెలుస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బల్లగుద్ది మరీ వాదించగా… ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా మారిపోయాయి. ఫ్యాన్ సుడిగాలిలో సైకిల్ కొట్టుకుపోయింది. అసలు గెలుస్తాడా? అనుకున్న వైసీపీ అభ్యర్థి బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. ఇక జగనన్న ప్రభుత్వం ఎక్కడా తగ్గలేదు. నాలుగున్నర ఏళ్లల్లో రూ.4.10 లక్షల కోట్లతో నవరత్నాలతో పేదలను ఆదుకున్నారు. కూలీనాలీ, నిరుపేద జనమే కాదు.. మధ్యతరగతి వర్గాలకు భరోసా ఇచ్చే పథకాలను జగనన్న అమలు చేశారు. కానీ.. ఆయనే మళ్లీ సీఎం కావటం తథ్యం. ఇదీ వైసీపీ అభిమాన జనం అభిప్రాయం. జనం బలం ఉంది. మరి తమను ఎందుకు మారుస్తున్నారని ఎమ్మెల్యేలు తెగ మథన పడుతున్నారు. జగనన్నను తిరస్కరించామా? చెప్పిన పని చేయలేదా? కుట్రలు చేశామా? కుతంత్రాలు చేశామా? అసలు జనానికి ఎందుకు దూరమయ్యాం? ప్రతి సంక్షేమ పథకం సీఎం ఆధ్వర్యంలో.. వలంటీర్లే అమలు చేస్తుంటే.. ఇక జనానికి మేమందుకు అవసరం? జనానికి చేతినిండా డబ్బులు వెళ్లాయి. ఇంకా ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకత వచ్చింది? దీనికి కారణం ఎవరు? ఈ ప్రశ్నలతో ఎమ్మెల్యేలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.

వామ్మో వాయ్యో..

ఐప్యాక్ సర్వే.. సొంత సర్వే… ఇంటిలిజెన్స్ సర్వే.. ఇలా సర్వేలన్నీ అత్యధిక మంది ఎమ్మెల్యేను ప్యాక్ చేయాలని సూచించటంతో.. మార్పులు, చేర్పులకు అధిష్టానం శ్రీకారం చుట్టింది. అంతే పనిచేయని మంత్రులనూ, ఎమ్మెల్యేలనూ పక్కన బెడుతూ, 175 మంది అభ్యర్థుల జాబితాను అధిష్టానం రెడీ చేసిందని తాడేపల్లి సమాచారం. డిసెంబర్ నెలాఖరు లోపు తమ అభ్యర్థులను వైసీపీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తరచూ సర్వేలు చేయిస్తూనే ఉన్నారు. ప్రతీ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఆధారంగానే.. తదుపరి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేదీ లేనిదీ నిర్ణయం తీసుకున్నారు. ఇక టికెట్ రానోళ్లు.. పక్షపాత ధోరణితో తమకు టిక్కెట్లు ఇవ్వలేదు అనే ఆరోపణలు రాకుండా జగనన్న జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లి వర్గాల సమాచారం మేరకు ప్రతి ఉమ్మడి జిల్లాలో ఐదుగురు నుంచి ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వటం లేదని సమాచారం. ఈ సమాచారం ప్రకారం ఏపీలో సుమారు 60 నుంచి 70 మందికి సీట్లు దక్కవని తెలుస్తోంది.

- Advertisement -

ఇక అలకలు.. బుజ్జగింపులు

సీట్లు దక్కవనే సమాచారంతో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు గగ్గోలు పెడుతున్నారు. తమ అనుచర గణంతో రాజీనామాస్త్రాలను సంధిస్తే..గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పరిణామాలను గుర్తు చేస్తున్నారు. . గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రాజీనామా చేయటంతో.. ఆయన అనుచరులు కూడా రాజీనామా చేశారు. అదే విధంగా రేపల్లెలో మోపిదేవీ వెంకట రమణ వర్గం కూడా రచ్చ రచ్చ చేసింది. కానీ మోపిదేవి వెంకట రమణ మాత్రం తన ప్లేట్ను తిరగబోశారు. ఈ మార్పులన్నీ వైసీపీ విజయం కోసమేనని కార్యకర్తలకు హితబోధ చేశారు. ఇక ఇప్పటికే గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు గ్రాఫ్ తక్కువగా ఉందనీ, తెలంగాణ ఎన్నికల ఫలితాల్ని దృష్టిలో పెట్టుకొని గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయిస్తున్నట్లు ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కంటి మీద కునుకు లేదు. ఏ రోజు తమను తాడేపల్లికి పిలుస్తారో? అని బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. 175 మంది అభ్యర్థుల జాబితాను సంక్రాంతి రోజుల విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సారి ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ల్లో ఎంత మంది గల్లంతు అవుతారో? మరి కొన్ని రోజుల్లోనే తేలనుంది. ఐతే, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వైసీపీలో.. తుపాను ముందు ప్రశాంతత ఏర్పడిందా? లేక పార్టీ అధిష్టానానికే కట్టుబడి సాహో అంటున్నారా? అనే విషయం తేలటం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement