Thursday, April 25, 2024

Ap | అభివృద్ధి, సంక్షేమం చేసే పార్టీలను ఆదరించండి : జయ ప్రకాష్ నారాయణ

ఎన్టీఆర్, ప్రభ న్యూస్ బ్యూరో : సంక్షేమం తాత్కాలిక ప్రయోజనాన్ని ఇస్తే అభివృద్ధి భవిష్యత్ తరాలకు సంపాదన సృష్టిస్తుందని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. అప్పులతో సంక్షేమాన్ని పంచితే ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అందుకు కూడా పరిమితి ఉండాలన్నారు. సంక్షేమమే పరిపాలననుకుంటే ఆ రాష్ట్రం నాశనం అవ్వడం ఖాయమన్నారు. అప్పులతో పంచుకుంటూ పోతే భవిష్యత్ తరాల మాటేమిటి అని ప్రశ్నించారు.

విజయవాడలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్లకాలం పుచ్చుకోవడం కాదు.. ఎప్పుడూ సంపాదించుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. పేదరికం పోయే విధానం అమలు కాకపోతే.. ప్రజలే నష్టపోతారనీ చెప్పారు. ప్రభుత్వాలు ఉపాధి , పెట్టుబడులు ప్రోత్సహించి… పని చేసుకుంటూ ఎవరి కాళ్ల మీద వారు నిలబడేలా చేయాలన్నారు. నేడు ఎపీలో సంక్షేమం, అభివృద్ది పైనే ప్రధానంగా పోరాటం సాగుతుందన్నారు.

- Advertisement -

ఇదే సమయంలో కులాలు, ముఠాల ప్రస్తావనే ఎక్కువుగా జరగడం విచారకరం అన్నారు. ఎపీలో ప్రజల భవిష్యత్ గురించి ప్రస్తావన తక్కువ.. కులాల గురించి చర్చ ఎక్కువుగా కనిపించడం బాధాకరమన్నారు. ఏ తప్పు ఎత్తి చూపినా.. వెంటనే కులం, మతం, ప్రాంతం తెరపైకి తెస్తున్నారనీ వాపోయారు. ఎన్నికలలో ప్రజలు ఇచ్చే తీర్పు సమాజ మార్పులో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

నేడు సంక్షేమం ఎంత అవసరం అంటున్నారో.. అభివృద్ది అంతకన్నా ఎక్కువ అవసరం అని గుర్తించాలన్నారు. నేడు అధికారంలో ఎవరు ఉంటే.. వారు నియంతలా వ్యవహరించడం తగదన్నారు. మద్దతుగా ఉంటే పూల బాట… ప్రత్యర్ధిగా ఉంటే.. ముళ్ల మార్గంగా మారుస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందా అని అన్నారు. దేశంలో చట్టబద్దమైన పాలన దిగజారిపోగా, ఎపీలో మరింత ఘోరంగా ఉందన్నారు.

గత ఐదేళ్లుగా ఎపీలో ఇటువంటి ఆర్ధిక ప్రగతి అంటూ లేకుండా పోయిందన్నారు. గతంలో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఏపీ, గత ఐదేళ్లుగా నిద్రాణంలోకి వెళ్లిపోయేలా పాలకులు చేశారన్నారు.ఎపీలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితికి తెచ్చారన్నారు. అయితే దోపీడీ, లేదా సంక్షేమం ఇదా ప్రజా పాలన అంటే పేద రాష్ట్రం ఒరిస్సా కన్నా ఘోరంగా ఎపీలో పరిస్థితి తయారైందన్నారు. భవిష్యత్ తరాలకు మంచి చేసేవారు, ఉపాధి అవకాశాలు చూపే వారికే పట్టం కట్టండినీ ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement