Friday, April 26, 2024

Rescue | విజయవంతంగా సారెక్స్‌-2023.. తీరప్రాంత రక్షణద‌ళం మాక్ డ్రిల్‌ సాహసోపేతం

కాకినాడ, ఆంధ్రప్రభ: కాకినాడ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో నిర్వహించిన ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ రీజనల్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఎక్సర్‌సైజ్‌ (సారెక్స్‌-2023) విజయవంతమైంది. బుధవారం ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ కాకినాడ స్టేషన్‌ ఆధ్వర్యంలో సముద్రంలో విపత్తు స్పందన, నిర్వహణపై మాక్‌ డ్రిల్‌ జరిగింది. ఓ చమురు నౌకలో అగ్ని ప్రమాదం సంభవించగా.. మంటలను అదుపులోకి తెచ్చి, నౌక సిబ్బందిని, ఇతర ప్రయాణికులను రక్షించేందుకు కోస్ట్‌గార్డ్‌ చూపిన ధైర్యసాహసాలు, శక్తిసామర్థ్యాలకు ఈ మాక్‌ డ్రిల్‌ ప్రతిబింబంగా నిలిచింది.

సముద్రపు నీటిని అధిక పీడనంతో ప్రమాదం సంభవించిన నౌకపైకి వెదజల్లడం, సముద్రంలో పడిపోయిన వారిని స్పీడ్‌ బోట్లతో రక్షించడం, చేతక్ హెలికాప్టర్‌తో గజ ఈతగాళ్లను సముద్రంలోకి దింపడం, ప్రమాదంలో ఉన్న వారిని రక్షించి, మెడికల్‌ నౌకలోకి చేర్చడం వంటి వాటిని అద్భుతంగా ప్రదర్శించారు. మాక్‌ డ్రిల్లో రిమోట్‌తో పనిచేసే లైఫ్‌ బోట్లు ఉత్తమ ప్రదర్శన కనబరచాయి. మాక్‌ డ్రిల్‌ అనంతరం కమాండెంట్‌ టీఆర్‌కే రావు మాట్లాడుతూ.. భారత తీరప్రాంత గస్తీ దళం ప్రారంభం నుంచి అసమాన శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తూ ప్రపంచంలో అత్యుత్తమ తీరప్రాంత రక్షణ దళాల్లో ఒకటిగా కొనసాగుతోందన్నారు.

సహజ విపత్తులు లేదా ప్రమాదవశాత్తు నౌకల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా చూసేందుకు కోస్ట్‌గార్డ్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రాణాలను కాపాడటానికి అత్యంత ప్రాధాన్యమిస్తామని తెలిపారు. విపత్తు నిర్వహణలో కీలకమైన సన్నద్ధతను, శక్తిసామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ఇలాంటి ఎక్సర్‌సైజ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏటా ప్రాంతీయ ఎక్సర్‌సైజ్‌లు జరుగుతుంటాయని.. రెండేళ్లకోసారి అంతర్జాతీయ ఎక్స్‌ర్‌సైజ్‌లు జరుగుతున్నట్లు వివరించారు. గతేడాది నిర్వహించిన అంతర్జాతీయ ఎక్సర్‌సైజ్‌లో 22 దేశాలు పాల్గొన్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంతో కూడిన రీజనల్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహణ బాధ్యతను కాకినాడ కోస్ట్‌గార్డ్‌ స్టేషన్‌కు అప్పగించినట్లు వెల్లడించారు.

ఈ ఎక్సర్‌సైజ్‌లో ఐసీజీఎస్‌ సముద్ర పహరెదార్‌, ఐసీజీఎస్‌ విగ్రహ, ఐసీజీఎస్‌ కనకలత బారువా, ఐసీజీఎస్‌ ప్రియదర్శిని, చార్లీ 430, చార్లీ 438, చార్లీ 449 నౌకలు పాల్గొన్నాయి. ఈ నెల 28వ తేదీన నిర్వహించిన వర్క్‌షాప్‌లో రూపొందించిన ప్రణాళికను క్షేత్రస్థాయిలో నిజ వాతావరణంలో అమలుచేసేందుకు బుధవారం ఈ ఎక్సర్‌సైజ్‌ను చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఎక్సర్‌సైజ్‌ విజయవంతమైందని.. ఇందుకు ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement