Tuesday, April 30, 2024

విశాఖ ఉక్కు… బిక్కు బిక్కు…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఎవరి సంకల్ప బలాన్ని వారు ప్రదర్శిస్తున్నప్పటికీ అన్ని పార్టీలదీ ‘ఒట్టి’ సంకల్పంగానే కనిపిస్తున్నది. అంతిమంగా కేంద్రం నిర్ణయమే పైచేయి కాబోతున్నది. మొదటి నుండి ఏపీ సర్కార్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నది. ఇదే అంశంపై 2021 ఫిబ్రవరి 6వ తేదీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. నాటి నుండి నేటి వరకూ అదే నినాదానికి జగన్‌ ప్రభుత్వం కట్టుబడి అదే సంకల్పంతో ఉంది. తాజాగా విశాఖను సొంతం చేసుకునేందుకు తెలంగాణ సర్కార్‌ కూడా రంగంలోకి దిగింది. ఆ రాష్ట్రానికి చెందిన సింగరేణి సంస్థకు అర్హత లేకపోయినా స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించిన బిడ్‌లో పాల్గొనాలని నిర్ణయం తీసుకుంది. ఆదిశగా ప్రకటన కూడా చేసింది. మరోవైపు టెండర్‌ సమయం కూడా దగ్గర పడుతున్నది. దీంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా అందరి దృష్టి విశాఖ ప్లాంట్‌పై పడింది. ఇటు ఏపీలోనూ అటు తెలంగాణలోనూ అధికార పక్షాలతోపాటు ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మొదలు పెట్టాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు సంకల్పంపై కొత్త చర్చ తెరమీదకు వచ్చింది.

. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఎవరి వైఖరులతో వారు ఉన్నప్పటికీ తెరవెనుక మాత్రం కేంద్రం శరవేగంగా చక్రం తిప్పుతున్నది. బిడ్‌ ముసుగులో ప్లాంట్‌ను ఆదానీ సంస్థకు కట్టబెట్టే ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తుంది. ఇదే విషయాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సైతం పదే పదే ప్రస్తావిస్తున్నాయి. బిడ్డుకు సంబంధించిన నిబంధనలు చూస్తే దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఏ సంస్థలు కూడా బిడ్డును దక్కించుకునే అవకాశాలు కనిపించడం లేదు. అందుకు పలు సాంకేతికమైన కారణాలు, సమస్యలు అడ్డంకుగా ఉన్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తున్నది. రూ.5 వేల కోట్లకు పైగా విలువచేసే బిడ్‌లో పాల్గొనే కంపెనీలు ప్రభుత్వ వాటాదారులుగా ఉండకూడదు. అలా ఉంటే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లోని బ్లాస్ట్‌ ప్లాంట్‌ (బీఎఫ్‌-3) టెండర్లలో పాల్గొనే అవకాశం లేదు. ఈ షరతులను విధించడం వెనుక బలమైన కారణాలు లేకపోలేదు.

అదానీకి కట్టబెట్టడమే ఏకైక లక్ష్యం
రాష్ట్రంలో ఇప్పటికే పలు నౌకా కేంద్రాలతోపాటు విద్యుత్‌ కేంద్రాలను సొంతం చేసుకుని ఏపీలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని బలోపేతం చేసుకుంటున్న గౌతమ్‌ అదానీ సంస్థకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అప్పగించే యోచనలో కేంద్రం ఉందని మొదటి నుండి జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అనేక సందర్భాల్లో ఇదే అంశాన్ని తెరమీదకు తెస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో జరుగుతున్న వ్యవహారాన్ని బిడ్డుకు సంబంధించిన అంశాలను లోతుగా పరిశీలిస్తే వీలైనంత త్వరలోనే ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోతున్నారన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. అందుకు బలమైన కారణాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు నిర్వహిస్తున్న టెండర్లలో పలు బలమైన సంస్థలు ఇప్పటికే బిడ్డును దాఖలు చేశాయి. ఈనెల 15వ తేదీ వరకూ సమయం ఉన్న నేపథ్యంలో బిడ్‌లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. సింగరేణి సంస్థ ద్వారా బిడ్‌ వేయించాలని ఆదిశగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తుంది. అందుకోసం ప్రత్యేక బృందాన్ని కూడా విశాఖకు పంపింది. ఐతే సాంకేతికంగా చూస్తే సింగరేణి సంస్ధ బిడ్‌లో పాల్గొన్నా దక్కే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయన్న వాదన కూడా అధికార వర్గాల్లో వినిపిస్తుంది.

అదే విధంగా మరికొన్ని సంస్ధలు కూడా సాంకేతికపరమైన ఇబ్బందుల్లోనే ఉన్నాయి. ఈనేపథ్యంలో టెండర్ల ప్రక్రియ చేపట్టినప్పటికీ బీఎఫ్‌-3 నిర్వహణకు సంబంధించి ఏ కంపెనీకి అధికారం దక్కే అవకాశాలు లేవు. ఇదే అభిప్రాయం ఆయా నిపుణుల్లోనూ వ్యక్తమవుతుంది. మరి అటువంటప్పుడు బిడ్‌ ప్రక్రియను కేంద్రం ఎందుకు తెరమీదకు తెచ్చింది.. ఇదే ప్రశ్న అందరిలోనూ బలంగా వినిపిస్తుంది. కీలకమైన ప్లాంట్‌కు సంబంధించి నిర్వహించిన బిడ్‌లో ఏ సంస్ధ దక్కించుకోలేకపోయింది కాబట్టి ఇక ప్లాంట్‌ను నిర్వహించడం సాధ్యం కాదని కేంద్రం అధికారికంగా తేల్చి చెప్పబోతుంది. ఈ అంశాన్ని అధికారికంగా ప్రకటించడం కోసమే బిడ్‌ ప్రక్రియను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తుంది. ఆతరువాత ప్రైవేటు పరం చేయడమే ఏకైక మార్గమని తెలుగు రాష్ట్రాలను, కార్మికులను నమ్మించే ప్రయత్నం చేసి ప్లాంటును ఆదానీ కంపెనీకి కట్టబెట్టబోతున్నారు.

- Advertisement -

లేఖల పేరుతో ఏపీ ప్రభుత్వం మౌనం
రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద పరిశ్రమ విశాఖ ఉక్కు. ఈ పరిశ్రమను నిలబెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి గట్టి ప్రయత్నం చేస్తూ వస్తుంది. నష్టాల్లో ఉన్న సంస్ధను తాము నిర్వహించలేమని కేంద్రం తేల్చి చెబుతూ వస్తుంది. అయితే విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలని కేద్రం నిర్ణం తీసుకున్న రోజే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లిd వెళ్లి కేంద్ర పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేశారు. అంతకు ముందే ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్న విశాఖ ఉక్కును నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేయొద్దని ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆలోచన చేయాలని కోరారు. తాజాగా టెండర్ల ప్రక్రియ తెరమీదకు వచ్చాక కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖల స్టాండ్‌ మీదే ఉంది. గడచిన రెండు రోజులుగా తెలంగాణ ప్రభుత్వం విశాఖ ఉక్కుపై రకరకాల ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం రాష్ట్రానికి సంబంధించిన పెద్దలు తమ ప్రభుత్వ అభిప్రాయాలను స్పష్టంగా తేల్చి చెప్పారు. కేంద్ర పరిధిలో ఉన్న విశాఖ ఉక్కును కేంద్రమే నిర్వహించలేకపోతే రాష్ట్రాలు నిర్వహించడం సాధ్యమా.. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొన్న నిర్వహించడం ఆషామాషీ విషయం కాదని ఇదే విషయం ఆ ప్రభుత్వ పెద్దలకు తెలిసినప్పటికీ రాజకీయం చేయడం తప్ప మరో అంశం కాదని చెబుతున్నారు. అయితే, విశాఖ ఉక్కును కాపాడుకోవడం తమ బాధ్యత అని అందుకోసం కేంద్రానికి పదే పదే పునరాలోచన చేయమని విజ్ఞప్తి చేస్తున్నామని చెబడాన్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖలకే పరిమితమైందన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతుంది.

అన్ని పార్టీలదీ ఒకటే నినాదం
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం మినహా రాష్ట్రంలోని అన్ని ప్రథాన పార్టీలదీ ఒకటే నినాదం. టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌, కమ్యునిస్టు పార్టీలది కూడా అదే మాట. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదు .. అని పదేపదే డిమాండ్‌ చేస్తున్నాయి. ఇదే సందర్భంలో ఈ ప్రక్రియను అడ్డుకోవడంలోనూ కేంద్రంపై పోరాటం చేయడంలోనూ ఏపీ సర్కార్‌ విఫలమైందన్న విమర్శలు కూడా ప్రధాన పార్టీలు బలంగా ప్రచారం చేస్తున్నాయి. తాజాగా గడచిన రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విశాఖ ఉక్కుపైనే విమర్శల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా మలుపులు తిరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement