Thursday, May 2, 2024

KNL: స్టిక్కర్ సీఎం జగన్ తో ప్రాజెక్టుల వ్యవస్థ సర్వనాశనం.. చంద్రబాబు

రాష్ట్రంలో స్టిక్కర్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్ మోహన్ రెడ్డి అని, ఆయనతో ప్రాజెక్టుల వ్యవస్థ సర్వనాశనమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల సందర్శన నిమిత్తం ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నందికొట్కూరులోని పటేల్ రోడ్డులో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. ఒక అవకాశం అంటూ అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం ప్రజల నెత్తిన పిడిగుద్దులు పెడుతున్నాడన్నారు. టీడీపీ హయాంలో ప్రాజెక్ట్ ల పేరిట రూ.65వేల కోట్లు ఖర్చు చేసాం. కానీ వైసీపీ ప్రభుత్వంలో రూ.22వేల కోట్లు ఖర్చు పెట్టారని.. రాయలసీమ ప్రాజెక్ట్ పేరిట రూ.2 వేల కోట్ల ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో హంద్రీనీవా, గాలేరు నగరి, వేదవతి ప్రాజెక్ట్ పనులు నిలిపివేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

కర్నూలుకు న్యాయ రాజధాని తీసుకొస్తానని నిర్మించాడా.. అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరిట వ్యవస్థను నాశనం చేశారన్నారు. అభివృద్ధిని పాతాళానికి తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జూపాడుబంగ్లా పరిధిలోని తంగెడెంచలో విత్తన కంపెనీ హబ్ గా మొదలు పెడితే వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. నందికొట్కూరులో పేద ప్రజల పేరిట రూ.ఐదు లక్షలకు తక్కువ ధరకు స్థలాలు కొని ఎక్కువ ధరకు రూ.60 లక్షలకు ప్రభుత్వానికి అమ్మిన ఘనత నియోజకవర్గం వైసీపీ నేతలకే దక్కిందన్నారు. అలగనూరు రిజర్వాయర్ ను మరమ్మత్తులు చేయలేని పరిస్థితిలో వైసీపీ నేతలున్నారన్నారు.
ఆలగనూరు నుంచి నందికొట్కూరు నియోజకవర్గం తాగునీటి అవసరాలకు రూ.70 కోట్లతో పనులు మంజూరు చేస్తే… పనులు పూర్తి చేశారా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటికే ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జ్ లు తగ్గిస్తామన్నారు. అందుకోసం తమ వద్ద పక్కా ప్రణాళికలు ఉన్నాయన్నారు. కరెంటు చార్జీలు పెరగకుండా తాము అధికారంలోకి రాగానే బాధ్యతలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాల పేరిట బటన్ నొక్కుతున్నాడని, వాటి మాటున బోకుడు బటన్ ఎక్కువైందన్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతూ ఆ డబ్బులు తాడేపల్లి కొంపకు పంపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క బ్రాందీ షాపులో అయినా బిల్ ఇస్తున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇసుక, మద్యం, భూ దందాలు నిర్వహిస్తూ భూములు లాగేసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గిస్తామని మందుబాబులకు ఆయన హామీ ఇచ్చారు.

మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చదువుకునే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు. అమ్మ వందనం కింద వారికి చదువు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అమ్మ ఒడి ఉత్తిత్తిదని ధ్వజమెత్తారు. గత నెల అమ్మ ఒడి పేరిట బటన్ నొక్కితే.. ఇంతవరకు డబ్బులు పడ్డాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు ప్యాకెట్ మని కింద రూ.1500 ఇస్తామన్నారు. దీపం పథకం తాము తీసుకొస్తే.. వాటికి ధరలు పెంచి దీపమార్పేశారన్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో యువగళం సూపర్ హిట్ అయిందని, యువత అండగా నిలిచారన్నారు. అందుకే వారి కోసం రాబోయే రోజుల్లో 20లక్షల ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. జాబు రావాలంటే బాబు రావాలని.. అందుకోసం ఆరు నెలలు పనిచేస్తే యువత జీవితాన్ని బాగు చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.

ఉద్యోగాలు వచ్చేవరకు నిరుద్యోగులకు రూ.3 వేలు భృతిగా ఇవ్వనున్నట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఏడాదికి రూ.1.20 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం బీసీ సోదరుల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామన్నారు. రైతులకు విద్యుత్ చార్జీల భారం మోపకుండా నూతన విధానాన్ని తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామన్నారు. రాయలసీమకు రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టలేని మీరు రాయలసీమ ద్రోహిగా నిలిచిపోయావా లేదా అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని మరో సారి ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ రాకపోయి వుంటే అభివృద్ధి అంశంలో తెలంగాణాతో పోటీ పడే వాళ్ళమన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి నందికొట్కూరు నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నందికొట్కూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రాజెక్ట్ లను సందర్శిస్తానన్నారు. నీరు మన భవిష్యత్తు అని, వీటి ద్వారా అన్ని లక్ష్యాలు సాధ్యమవుతుందన్నారు.

- Advertisement -

పోలవరం పూర్తి చేస్తానని వైసీపీ నేతలు గోదావరిలో ముంచారన్నారు. తామ అధికారంలోకి రాగానే పోలవరం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. మాదిగలకు, బుడగ జంగాలకు న్యాయం చేస్తామన్నారు. జీవో 98 కింద నీటి ముంపు బాధితుల్లో మిగిలిన వారికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. నందికొట్కూరు, మిడుతూరు, కొత్తపల్లి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తామన్నారు. వైసీపీ పేరులోనే కరెక్షన్ ఉందని, టీడీపీ పేరులోనే డెవలప్మెంట్ ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తు చేసేందుకు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలన్నారు. ప్రజలను సమాయత్తం చేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తానెప్పుడూ సింహంగా బతుకుతా, సింహంగా పోరాడుతా, సింహంగానే వెళ్లగలనని చంద్రబాబుకు పేర్కొన్నారు. నా వయసు నెంబరే.. కానీ.. యువకుడిలా 18 గంటలు పని చేస్తానన్నారు. 40ఏళ్లు పనిచేశా.. ఇంకా పని చేస్తానని, తన పనిలో అభివృద్ధిని 18 ఏళ్లు ముందుగా తీసుకెళ్తానని చంద్రబాబు పేర్కొన్నారు.

నందికొట్కూరులో ఒకాయన.. తన ఇష్టం వచ్చినట్లుగా ఎగురుతున్నాడన్నారు. ఆయనకు ఎమ్మెల్యే అంటే కూడా గౌరవం లేదన్నారు. నీ ఆటలు నావద్ద సాగవని.. గట్టిగా అరిస్తే నాయకుడు కాలేడని చంద్రబాబు పేర్కొన్నారు. రౌడీయిజం చేస్తే ఖబర్దార్.. తాటా తీస్తాం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదనీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా చంద్రబాబు హెచ్చరించారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టును రూ.90 కోట్లతో తానే నిర్మించి ప్రారంభోత్సవం చేస్తే.. తిరిగి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేసి స్టిక్కర్ వేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అందుకే ఆయన స్టిక్కర్ ముఖ్యమంత్రిగా గుర్తిండిపోయారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement