Wednesday, May 1, 2024

AP | ప్రాణాలు అడ్డువేసి అయినా సరే స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడతా : వైఎస్‌ షర్మిల

తమ ప్రాణాలు అడ్డువేసి అయినా సరే స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకొంటామని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ పేరుతో శనివారం సాయంత్రం స్టీల్‌ ప్లాంట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆమె మాట్లాడారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ కోసం సీఎం జగన్‌ ఎందుకు ఉద్యమం చేయలేదని షర్మిల ప్రశ్నించారు.

”ఇప్పటికే గంగవరం పోర్టును అదానీకి అప్పగించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కుట్రలు పన్నుతున్నారు. క్రమంగా పరిశ్రమను నష్టాల్లోకి తీసుకెళ్లారు. ఇక్కడ పనిచేసే 30 వేల మంది కార్మికులు ఏం కావాలి? పరిశ్రమను ప్రైవేటు పరం చేయొద్దని అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకొంటే సరిపోతుందా? ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని గురించి కేంద్రాన్ని పాలపక్షం, ప్రతిపక్షం ఎవరూ అడగరు. ఒక్కరంటే ఒక్కరైనా కార్మికులకు మద్దతుగా నిలిచారా?

‘సిద్ధం’ సభలకు జగన్‌ రూ.600 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఆయన ‘సిద్ధం’ అయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ల్యాండ్‌, మైనింగ్‌, లిక్కర్‌ మాఫియానే. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఏమైంది? పూర్తిగా మద్య నిషేధం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనన్నారు. చివరికి ప్రభుత్వమే మద్యం విక్రయిస్తోంది. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిందా? ఒక ఊరి అభ్యర్థులను మరో ఊరికి మార్చడం ఎప్పుడూ చూడలేదు. అభ్యర్థులను బదిలీ చేయడం వైకాపాలోనే చూస్తున్నాం” అని షర్మిల విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement