Friday, May 3, 2024

సమస్యాత్మక ప్రాంతాల్లోనూ పోలింగ్ ప్రశాంతం – జిల్లా కలెక్టర్ జె.నివాస్

శ్రీకాకుళం, : జిల్లాలో ఇచ్చాపురం, పలాస – కాశీబుగ్గ పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీ
ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని, ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సైతం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ పేర్కొన్నారు. పోలింగ్ సరళి పరిశీలనలో భాగంగా బుధవారం ఉదయం పలాస – కాశీబుగ్గ పురపాలక సంఘంలో జరుగుతున్న ఎన్నికల తీరును కలెక్టర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ తో కలిసి పరిశీలించారు. పలాస-కాశీబుగ్గలోని చిన్న బాడం, పెసరపాడుతో పాటు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, అక్కడ పోలింగ్ జరుగుతున్న సరళిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరగాలని, చివరి ఓటరు వరకు పోలింగ్ కొనసాగాలని సూచించారు. మధ్యాహ్నం 01.00 గం.కు జిల్లావ్యాప్తంగా 40,268 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు పాలకొండ నగర పంచాయతీలో 38.6 శాతం, ఇచ్చాపురంలో 44.4 శాతం, పలాస-కాశీబుగ్గ లో 47 శాతం వెరసి సగటున 44.4 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు. ఓటర్లకు అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించినందున గతంలో కంటే పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 05.00 గం.ల వరకు కొనసాగుతుందని అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూములకు తరలించి సీజ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. కాగా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని 18,19 వార్డులను సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ రెవిన్యూ డివిజనల్ అధికారి టి.వి.ఎస్.జి.కుమార్ తో కలిసి పర్యటించగా, ఇచ్చాపురం పురపాలక సంఘం పరిధిలోని పలు కేంద్రాలను సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement