Wednesday, May 22, 2024

AP: వైభవంగా శ్రీ సత్య సాయిబాబా జయంతి వేడుకలు ప్రారంభం

శ్రీ సత్యసాయి బ్యూరో, నవంబర్ 18(ప్రభ న్యూస్) : ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబా 98వ జయంతి వేడుకలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు భారీగా తరలివచ్చారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి నవంబర్ 23ను పురస్కరించుకొని, ప్రతి ఏటా నవంబర్ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా మొదటి రోజు వేణుగోపాలస్వామి రథోత్సవం నిర్వహించారు.

ముందుగా శ్రీ సత్యసాయి ట్రస్ట్ అధినేత రత్నాకర్, స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి పలువురు పుర ప్రముఖులు, సాయిబాబా ట్రస్ట్ సభ్యులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రశాంతి నిలయం ప్రధాన ద్వారం వద్ద ప్రముఖులంతా రథాన్ని లాగి, రథోత్సవాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి నుంచి సత్యమ్మ గుడి వరకు శ్రీ వేణుగోపాలస్వామి రథోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గల బాబా భక్తులు, వివిధ వేషధారణలో, వివిధ రూపాలలో ప్రదర్శనలు, కోలాటాలు, నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు భక్తులను అలరించాయి. ప్రధానంగా భారతదేశంలోని ఆయా రాష్ట్రాలలో గల సాయిబాబా భక్తులు తమ ప్రత్యేకమైన వస్త్రధారణ, అలంకరణ, వేషధారణ లతో పుట్టపర్తి వీధుల్లో ప్రదర్శించడం కనువిందు చేశాయి. ప్రధానంగా నెమలి పింఛన్లు, కమలం ఆకారంలో అలంకారం, గురువయ్యల నృత్యం, లంకేయుల నాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement