Tuesday, May 21, 2024

క్రీడా సంగ్రామానికి చకచకా ఏర్పాట్లు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జాతీయ క్రీడలు

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు నగరాల్లో జరగనున్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలు 2022-23కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 17 నుంచి 22 వరకు ఈఎంఆర్‌ఎస్‌ జాతీయ క్రీడలు జరగనున్నాయి. ఇప్పటికేముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ ఈవెంట్‌ పై ప్రత్యేక దృష్టి సారించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అటు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రివర్యులు అర్జున్‌ ముండా ఏపీ ప్రభుత్వానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. క్రీడాకారులు, అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

దేశంలోని గిరిజన విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించే విధంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నేషనల్‌ గేమ్స్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ జాతీయ క్రీడలు నిర్వహించేందుకు పలు రాష్ట్రాల్రు ముందుకురాగా ఆంధ్రప్రదేశ్‌ కే అవకాశం దక్కింది. క్రీడాకారులకు అందించాల్సిన సామాగ్రి, కిట్‌ లు వేదికల వద్దకు చేరుకుంటున్నాయి. అలాగే ఏఎన్‌.యూ, లయోలా కళాశాలల్లో విద్యార్థుల వసతి కోసం హాస్టళ్లను సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటుగా జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చే వివిధ రాష్ట్రాల్ర క్రీడాకారులు, అధికారులు, సిబ్బందికి భోజన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నాయి. రోజుకి 7వేల మందికి పైగా భోజనాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

- Advertisement -

గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా, ప్రతి ఒక్కరిలోనూ క్రీడాస్ఫూర్తి నింపేలా ఏర్పాట్లు ఉండాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు అర్జున్‌ ముండా సూచనల మేరకు అధికారులు అహర్నశలు శ్రమిస్తున్నారు. ఈ మెగా ఈవెంట్స్‌కు ప్రధాన వేదికలైన గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీలో క్రీడా మైదానలు సిద్ధమవుతున్నాయి. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్‌తో పాటు హ్యాండ్‌బాల్‌, చెస్‌ వంటి క్రీడలకు నాగార్జున యూనివర్సిటీ ఆతిథ్యమిస్తుండగా, హాకీ, ఫుట్‌బాల్‌, బాక్సింగ్‌, జూడో, తైక్వాండో వంటి క్రీడలకు విజయవాడ లయోలా కళాశాల వేదిక కానుంది. టెన్నీస్‌కు ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం, స్విమ్మింగ్‌కు విజయవాడ గాంధీనగర్‌లోని వీఎంసీ జింఖానా స్విమ్మింగ్‌ పూల్‌, బ్యాడ్మింటన్‌కు విజయవాడ పటమట ఇండోర్‌ స్టేడియం ఆతిథ్యమిస్తున్నాయి.

22 రాష్ట్రాలు… 22 ఈవెంట్లు..!

ఈఎంఆర్‌ఎస్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ 2022 కి 22 రాష్ట్రాల్ర నుంచి దాదాపు 4500 క్రీడాకారులు హాజరవుతున్నారు. వీరికి 22 క్రీడల్లో పోటీలు జరగబోతున్నాయి. వాటిలో 15 వ్యక్తిగత, 7 టీమ్‌ గేమ్స్‌ జరగనున్నాయి. ఆయా ఈవెంట్లలో అండర్‌-14, అండర్‌-19 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. వీటిలో బాలురు, బాలికలకు విడివిడిగా ఈవెంట్లు ఉంటాయి. ఈ మెగా ఈవెంట్‌ నిర్వహణ బాధ్యతలను ఉపముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు పీడిక రాజన్న దొర తీసుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాంతిలాల్‌ దండే, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కుమారి. జాహ్నవి మేడిద జీసీసీ ఎండీ శ్రీ సురేష్‌ ఐఐస్‌, టైకార ఎండీ ఈ.రవీంద్ర బాబు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్‌ ఇన్‌ ఛీఫ్‌ ఎస్‌ శ్రీనివాసరావు జాతీయ క్రీడలకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement