Sunday, April 28, 2024

AP: టాస్క్ ఫోర్స్ దాడుల్లో ఆరుగురు ఎర్ర స్మగ్లర్లు అరెస్టు..


తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : తిరుపతి జిల్లా పరిధిలో రెండు వేర్వేరు చోట్ల దాడులు జరిపిన ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి, 18ఎర్రచందనం దుంగలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వివరాలను ఈరోజు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఆ వివరాల ప్రకారం డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో ఆర్ఎస్ఐ లింగాధర్ టీమ్ గురువారం సాయంత్రం కల్యాణి డ్యాం నుంచి చీకటీగలకోన మీదుగా శ్రీవారిమెట్టు వైపు కూంబింగ్ చేపట్టారు.

అర్ధరాత్రి సమయంలో భాకరాపేట రేంజ్ నాగపట్ల ఈస్ట్ ఫారెస్టు బీటు పరిధిలో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వారిని టాస్క్ ఫోర్సు టీం చుట్టుముట్టగా వారు రాళ్లు, కొడవళ్లతో దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంటాడిన సిబ్బంది వారిలో తమిళనాడు, తిరువన్నామలై జిల్లా జమునామత్తూరుకు చెందిన మణి(37)ను పట్టుకున్నారు. ఇతర స్మగ్లర్లు తప్పించుకోగా వారు పారవేసిన 11ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో రైల్వే కోడూరు టాస్క్ ఫోర్సు ఆర్ఎస్ఐ ఆలీబాషా టీమ్ నాయుడుపేట వైపు వెళుతూ, గూడూరు-నాయుడుపేట హైవే రోడ్డు మీద బూధానం టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ రోజు ఉదయం ఒక కారులోని కొందరు వ్యక్తులు వాహనం వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు.

టాస్క్ ఫోర్సు సిబ్బంది వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. వారి కారులో తనిఖీలు చేయగా.. అందులో 7ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటిని కారుతో పాటు స్వాధీనం చేసుకుని ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో తమిళనాడు తిరుపత్తూరు జిల్లాకు చెందిన హరీష్ శక్తి (24), వేలూరు జిల్లాకు చెందిన సంతోష్ సెట్టు(22), ప్రభు ముత్తుస్వామి (23), శరత్ కుమార్ (21), రామచంద్రన్ (26) ఉన్నారు. ఈ రెండు కేసుల్లోని దుంగల విలువ సుమారు రూ.20లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులను సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రఫీ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని ఎస్పీ పీ.శ్రీనివాస్ అభినందించి, వారికి రివార్డులను ప్రకటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement