Saturday, May 4, 2024

తెలుగు రాష్ట్రాల పరస్పర అంగీకారం, ఆమోదంతోనే ఆస్తుల విభజన: విజయసాయి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం, ఆమోదం కుదిరినప్పుడు మాత్రమే ఆస్తుల విభజనపై నిర్ణయం తీసుకోవడం సాధ్యపడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10 కింద జాబితాలో పేర్కొన్న సంస్థలు, జాబితాలో లేని సంస్థల మొత్తం ఆస్తుల విలువ 1,42,601 కోట్ల రూపాయలు కాగా… చట్టబద్దంగా జరగాల్సిన ఈ ఆస్తుల విభజన ఇప్పటి వరకు జరగనందున దాని దుష్ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై పడిందని, ఆస్తుల విభజనకు తీసుకుంటున్న చర్యలేంటని వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ను ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూలు కింద పేర్కొన్న సంస్థల విభజన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని చెప్పారు. 90 ఆస్తులను రెండు రాష్ట్రాల మధ్య విభజించాలని కమిటీ సిఫార్సు చేసిందని చెప్పారు. ఈ ఆస్తులలో 68 సంస్థల విభజనకు తెలంగాణ ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఆంధ్రప్రదేశ్‌ 68గాను కేవలం 33 సంస్థల విభజనకు మాత్రమే అంగీకరించిందని గుర్తు చేశారు.

పెండింగ్‌లో ఉన్న అన్ని ఆస్తుల విభజనకు సమగ్రమైన పరిష్కారం కావాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతుండగా కేసుల వారీగా మాత్రమే పరిష్కరించాలని తెలంగాణ కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. విభజన చట్టంలోని పదో షెడ్యూలులో పేర్కొన్న 112 శిక్షణా సంస్థల విభజనకు సెక్షన్‌ 75 కింద ఎలాంటి విధివిధానాలను నిర్దేశించనందున సమస్య ఏర్పడినట్లు నిత్యానంద రాయ్ వివరించారు. ఈ సంస్థలను జనాభా ప్రాతిపదికన విభజించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతుండగా భౌగోళిక విభజన ప్రాతిపదికన చేపట్టాలని తెలంగాణ కోరుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉభయ రాష్ట్రాల మధ్య పెండింగ్‌ సమస్యలను సామరస్యంగా పరిష్కరించడానికి వీలుగా హోం మంత్రిత్వ శాఖ పలు దఫాలుగా సూచనలను జారీ చేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం, ఆమోదం కుదిరినప్పుడు మాత్రమే ఆస్తుల విభజనపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement