Thursday, April 25, 2024

టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరించాలి: విజయసాయి..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీడీ)కి సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) రిజిస్ట్రేషన్‌ను తక్షణమే పునరుద్ధరించాలని వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి బుధవారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు అత్యంత భక్తిగా ఆరాధించే దైవం తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి అని, ఈ ఆలయాన్ని పాలించే తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) చేపట్టే వివిధ సామాజిక, విద్యా, ధార్మిక, సాంస్కృతిక కార్యకలాపాలు కూడా అంతే ప్రసిద్ధి చెందాయని అన్నారు. శ్రీవారి ఆలయాన్ని సందర్శించే భక్తులతోపాటు విదేశాలలోని భక్తులు ఇచ్చే విరాళాల సాయంతో టీటీడీ ఈ కార్యక్రమాలను చేపడుతోందని విజయసాయి వివరించారు. విదేశీ భక్తులు ఇచ్చే విరాళాలను స్వీకరించడానికి టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ కింద గతంలోనే రిజిస్ట్రేషన్‌ పొందింది. ఇటీవల కాలంలో సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించడానికి నిరాకరించిందని ఆయన చెప్పారు.

రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరణ కోసం టీటీడీ చట్టపరమైన అన్ని నిబంధనలను పాటించినప్పటికీ రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరణకు హోం మంత్రిత్వ శాఖ తిరస్కరించడం విచారకరమని అన్నారు. గత డిసెంబర్‌ 31 నాటికి టీటీడీ సమర్పించిన వార్షిక రిటర్న్‌ల ప్రకారం టీటీడీ విదేశీ విరాళాల బ్యాంక్‌ ఖాతాలో 13.4 కోట్ల రూపాయలు జమ అయ్యాయని, డిసెంబర్‌ 2021 తర్వాత టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరణ చేయనందున టీటీడీ వివిధ సామాజిక, విద్యా, ధార్మిక కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రాధాన్యత, ప్రాచుర్యత దృష్ట్యా టీటీడీ చేపట్టే పలు కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యపై దృష్టి సారించి టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించాలని విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement