Saturday, May 4, 2024

శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు.. -ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలను సందర్శించే భక్తుల కోసం ఆర్టీసీ 3,800 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది తలెత్తకుండా శైవ క్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో తాత్కాలిక బస్సు స్టేషన్ల ఏర్పాటు- చేశారు. రాష్ట్రంలోని 101 శైవ క్షేత్రాలకు 25 లక్షల మంది భక్తులు వస్తారని ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. ఇంఉదకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. కోటప్పకొండకు 675 బస్సుల్లో 4.60లక్షల మంది, శ్రీశైలంకు 650 బస్సుల్లో 2.50లక్షల మంది, కడప జిల్లా పొలతలకు 200 బస్సులు, పట్టి సీమకు 100 బస్సులు నడుపుతారు. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా అదనపు ట్రిప్పులు, బస్సులను ఆర్టీసీ సిద్ధం చేసింది. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో పర్యవేక్షణ చేస్తారు.

- Advertisement -

సమూహాలుగా ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు సమీప డిపోల్లో మేనేజర్లను సంప్రదిస్తే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. గత రెండేళ్లుగా ఆర్టీసీపై డీజిల్‌ భారం పడుతున్నప్పటికీ ప్రయాణ ఛార్జీల్లో మార్పులు లేకుండా గత ఏడాది ఛార్జీలనే వసూలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తిరుమల-తిరుపతి మధ్య తిరిగే 60 సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో పాటు కోటప్పకొండ సహా ఘాట్‌ రోడ్లలో తిరిగే బస్సుల్లో సుశిక్షితులైన డ్రైవర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇదే సమయంలో ఆయా ఘాట్‌ రోడ్లకు వెళ్లే బస్సులను ముందస్తుగానే అన్ని రకాల తనిఖీలు నిర్వహించి సిద్ధం చేశామని పేర్కొన్నారు.

భక్తుల కోసం బస్సెక్కే ప్రాంతాల్లో తాత్కాలిక బస్సు స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు త్రాగునీరు, షామియానాలు, విచారణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమైన కూడళ్లు, మలుపుల వద్ద సేష్టీ డ్రైవింగ్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించడం ద్వారా భద్రతతో కూడిన ప్రయాణం అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవక్షేత్రాలను సందర్శించే శివ స్వాములు, భక్తులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం చేసి ఆదరించాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement