Tuesday, April 30, 2024

ఆర్టీసీ దసరా స్పెషల్‌! బాదుడు లేకుండానే ప్రత్యేక బస్సులు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్టీసీ ప్రయాణీకులకు శుభవార్త. పండుగ స్పెషల్‌ పేరుతో అదనపు చార్జీల సంప్రదాయాన్ని ఈసారి ఆర్టీసీ విరమించుకుంది. ప్రస్తుతమున్న సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. దసరాకు ఆర్టీసీ 4,500 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఈ నెల 29 నుంచి అక్టోబర్‌ 7వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. గతంలో ఉన్న అదనపు ఛార్జీలను రద్దు చేసినట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు చెప్పారు. సాధారణ రేట్లకే ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నందున ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురువారం ఆర్టీసీ బస్‌భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ పండుగలొస్తే ప్రత్యేక బస్సుల్లో ఆర్టీసీ 50శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తుందనే ప్రచారంతో సంస్థకు తీరని నష్టం జరుగుతోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆదాయం కంటే ప్రయాణికుల సేవే ముఖ్యమని భావించి సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నామన్నారు. ఇప్పటికే ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వహకులు భారీగా ఛార్జీలు పెంచినట్లు తమ దృష్టికి వచ్చిందని చెపుతూ అదనపు ఛార్జీలు లేని ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయాలని కోరారు. ప్రత్యేక బస్సుల్లో చిల్లర సమస్య తలెత్తకుండా ఈ-పోస్‌ను అందుబాటులో పెడుతున్నామన్నారు. ఇదే సమయంలో నిరంతరం పని చేసే విధంగా 0866-2570005 కాల్‌ సెంటర్‌, జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా ప్రయాణికులకు సమచారం ఇవ్వనున్నామన్నారు. ప్రయాణికులకు సేవ చేయడమే ఆర్టీసీ ప్రధాన లక్ష్యమంటూ దసరా సెలవుల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

విజయవాడ, తిరుమలకు ప్రత్యేక ఏర్పాట్లు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు, తిరుమలలో టీటీడీ బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణి కులకు అసౌకర్యం లేని విధంగా ముందస్తు ఏర్పాట్లు చేశామని తిరుమలరావు చెప్పారు. రాష్ట్రంలోని 21 పట్టణాలతో పాటు హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై నుంచి కూడా అదనపు సర్వీసులు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. దసరా పండుగకు ముందు 2,100 బస్సులు, తిరుగు ప్రయాణంలో 2,400 బస్సులు అదనంగా అందుబాటులో ఉంచామని చెప్పారు. గతంలో ఓ వైపు వంద శాతం ఆక్యుపెన్సీ, మరోవైపు జీరో ఆక్యుపెన్సీని దృష్టిలో ఉంచుకొని 50శాతం ఛార్జీలు అదనంగా వసూలు చేసేవారని తెలిపారు. ఆదాయం అటుంచి ఆ ప్రచారంతో సంస్థకు భారీ నష్టం చేకూరుతున్న నేపధ్యంలో ప్రస్తుతానికి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని చెప్పారు. భవిష్యత్‌లో ఈ తరహా నిర్వహణ కష్టమైతే ఆయా పరిస్థితులను సమీక్షించి నిర్ణయం మార్చుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులకు చిల్లర సమస్య ఎదురు కాకుండా బస్సుల్లో ఈ-పోస్‌ యంత్రాలు అందుబాటులో ఉంచామని, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల స్వైపింగ్‌తో పాటు ఫోన్‌ పే, గూగుల్‌ పే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి టిక్కెట్లు పొందొచ్చని తెలిపారు.

దసరాకు స్టార్‌ లైనర్లు

ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా దసరా నుంచి స్టార్‌ లైనర్‌ నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తేనున్నామని తిరుమలరావు పేర్కొన్నారు. రద్దీ రూట్లలో 62 బస్సులు ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్‌లో మరిన్ని స్టార్‌ లైనర్‌ సర్వీసులు పెంచనున్నట్లు తెలిపారు. దసరాకు కొన్ని బస్సులు రానుండగా తదుపరి మరికొన్ని రానున్నట్లు ఆయన చెప్పారు. తిరుమల బ్రహ్మోత్సవాల నాటికి విద్యుత్‌ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పిన ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింప చేస్తామన్నారు. డిసెంబర్‌ నాటికి తిరుపతి సెక్టార్‌లో వంద విద్యుత్‌ బస్సులు తిరగనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement