Thursday, May 2, 2024

వైసిపిలో అస‌మ్మతి సెగ‌లు – నివార‌ణ‌కు రంగంలోకి దిగిన జ‌గ‌న్

అమరావతి, ఆంధ్రప్రభ: మరో ఏడాది కాలంలో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమౌతున్న అధికార పార్టీ అధినేతకు నేతల మధ్య నెలకొన్న విబేధాలు, అసమ్మతి నేతల వ్యవహారం తలనొప్పిగా మారింది. మొన్న నెల్లూరు జిల్లా, నిన్న ప్రకాశం జిల్లాలో పార్టీలో అసమ్మతి గళాలు బయటపడటంతో రేపు ఏ జిల్లాలో ఈ తరహా వ్యవహారం బయటకొస్తుందన్న దానిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఈనేపథ్యంలో ముఖ్యంత్రి, పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యూహాత్మక అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరులో అసమ్మతి నేతల వ్యవహారం బయటకొచ్చిన తరువాత ఆజిల్లా ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అధినేత జగన్‌ ఆదేశాల మేరకు పరిస్థితిని చక్కదిద్దడంలో విజయం సాధించారు. ఇప్పుడు ఆయనే అసమ్మతి గళం విప్పడంతో సీఎం జగన్‌ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అసలు పార్టీలో జరుగుతున్న పరిణామాలేంటన్నదానిపై ఆయనే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కొన్ని అంశాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా తానే స్వయంగా రంగంలోకి దిగి జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులపై తెలుసుకునే ప్రయత్నం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

నిరురుగప్పిన నిప్పులా బాలినేని వ్యవహారం
మాజీ మంత్రి బాలినేని అలకకు కారణాలపై నిశితంగా పరిశీలన చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే భారీగా డీఎస్పీల బదిలీలు నిర్వహించిన ప్రభుత్వం తాజాగా శనివారం మరోసారి డీఎస్పీల బదిలీలు చేపట్టింది. అందులో బాలినేని అలకకు కారణంగా చెబుతున్న ఒంగోలు డీఎస్పీకి స్థానచలనం కల్పించారు. దర్శిలో ఉన్న నారాయణ స్వామి రెడ్డిని ఒంగోలుకు, ఒంగోలులో డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న అశోక్‌ వర్దన్‌ను దర్శికి బదిలీ చేశారు. అయితే, బాలినేని మాత్రం ఇంకా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయాల్సిన పార్టీ పెద్దలే పార్టీలో విబేధాలకు కారకులవుతున్నారన్నట్లు ఆయన తన సన్నిహితులతో చెబుతున్నారని సమాచారం. ఈక్రమంలోనే ఆయన తెదేపా వైపు చూస్తున్నారని, సీఎం జగన్‌ బంధువుగా పేరు ఉండటంతో ఆయన్ను పార్టీలోకి లాగేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు సేవ చేస్తుండటమే తన తప్పన్నట్లుగా పార్టీ పెద్దలు వ్యవహరించారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సీరియస్‌గా తీసుకుని పోస్టు మార్టం నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బాలినేని వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉందని అర్ధమౌతోంది.

ఒక్కో జిల్లాలో రెండు మూడు రోజులు
తాజాగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా త్వరలో ఆయన చేపట్టాలనుకుంటున్న జిల్లాల పర్యటనలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవంగా ఆయన ప్రతి జిల్లాలోనూ బస్‌ యాత్రగా వెళ్లి ఒక రోజు బసచేసేలా ముందుగా అనుకున్నారు. కానీ, పార్టీలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒక్కో జిల్లాలో రెండుమూడు రోజులు ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. సమస్య ఝఠిలంగా ఉన్న జిల్లాల్లో అయితే మరో ఒకటి రెండు రోజులు అధికంగా అయినా ఉండేందుకు ఆయన సన్నద్ధంగా ఉన్నారని సమాచారం. పాదయాత్ర సందర్భంగా ప్రతి జిల్లాలోనూ ఆయన కనీసం నాలుగైదు రోజులపాటు నడిచారు. ఆసందర్భంగా ఆయా జిల్లాల్లోని నేతలతో స్వయంగా మాట్లాడటం, వారి ఇబ్బందులు తెలుసుకోవడం, ఆతరువాత వాటిని పరిష్కరించేలా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఒక దశలో ఆయనే స్వయంగా బుక్‌ తీసుకుని కొన్ని అంశాలను నోట్‌ చేసుకుని వాటిని ఫాలోఅప్‌ చేసిన పరిస్థితి ఉంది. ఈనేపథ్యంలో జిల్లాల యాత్రలో కూడా కనీసం రెండు మూడు రోజులకు తగ్గకుండా ఒక్కో జిల్లాలో ఉంటూ అక్కడి నేతల మధ్య వ్యవహారాలను చక్కబెట్టే యోచనలో సీఎం జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

మహానాడులో చేరికలంటూ ప్రచారాలపై
ఇక పార్టీలో అసమ్మతిగా ఉన్న నేతలంతా రాజమహేంద్రవరంలో ఈనెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న మహానాడులో చేరతారంటూ వస్తున్న ప్రచారాలపై కూడా సీఎం జగన్‌ ఫోకస్‌ పెట్టారని తెలుస్తోంది. ఒకమోస్తరు నేతలు ఎవరైనా అసమ్మతితో ఉంటే వారి అసమ్మతికి సరైన కారణం ఉంటే దానిని సత్వరమే పరిష్కరించే దిశగా ఆయన స్వయంగా ఏర్పట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బలమైన పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన పరిస్థితుల్లో కొంత మంది నిర్లక్ష్యానికి పార్టీకి నష్టం చేకూరితే సహించే పరిస్థితి లేదని ఆయన ఇప్పటికే నేతలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈనేపథ్యంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పార్టీలో తనదైన మార్క్‌ను చూపించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement