Monday, April 29, 2024

Puttaparty – ప్రశాంతి రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు ప్రారంభం

శ్రీ సత్యసాయి జిల్లా,( కొత్తచెరువు), ప్రభ న్యూస్ : శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి సమీపంలోని ప్రశాంతి రైల్వే స్టేషన్ మీదుగా బుధవారం నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కొత్తచెరువు, ప్రశాంతి రైల్వే స్టేషన్ మధ్య టన్నెల్ మరమ్మత్తులతో గత డిసెంబర్ 8 నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను రైల్వే అధికారులు నిలిపివేశారు. ఫిబ్రవరి 8 నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని రైల్వే అధికారులు ప్రకటించిన విషయం విధితమే. టన్నెల్ మరమ్మత్తుల పనులు అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి కావడంతో బుధవారం నుంచి రైళ్ల మోతలు ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా రైళ్ల వినికిడి లేక ప్రశాంతి రైల్వే స్టేషన్ నిర్మానుష్యంగా ఉండేది, బుధవారం నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభం కావడంతో ప్రయాణికుల రద్దీ స్పష్టంగా కనిపించింది.

రాయలసీమలోని ఏకైక టన్నెల్ కొత్తచెరువు నుంచి ప్రశాంతి రైల్వే స్టేషన్ మధ్య ఉంది. ఇందులో తరచూ పైనుంచి రాళ్లు పడేవి. దీంతో ప్రమాద పరిస్థితిని గుర్తించిన రైల్వే అధికారులు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేశారు. ప్రస్తుతానికి 210 మీటర్ల ఈ టన్నెల్ లో రైలు ప్రయాణ వేగం 30 కిలోమీటర్లు గా నిర్ణయించారు. సాధారణంగా ఇక్కడ 60 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణిస్తుంది. మరి కొన్ని రోజులపాటు 30 కిలోమీటర్ల వేగాన్ని రైల్వే అధికారులు నిర్ణయించారు. శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రం పుట్టపర్తికి వచ్చే ప్రయాణికులకు రైళ్ల రాకపోకలు శుభవార్తగా పరిగణించవచ్చు. రైళ్ల రాకపోకల గురించి ఇంకా సమాచారం లేకపోవడంతో ప్రయాణికుల రద్దీ తక్కువగానే కనిపిస్తోంది. ధర్మవరం నుంచి చెన్నై, కొత్తపల్లి మీదుగా పెనుగొండకు వెళ్లే రైలు మార్గం సైతం మరమ్మత్తుల నేపథ్యంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ సహా మరికొన్ని రైళ్లు ప్రశాంతి రైల్వే స్టేషన్ మీదుగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement