Thursday, May 2, 2024

Prakasam Politics – మాగుంటకు నో చాన్స్​ – అలిగిన బాలినేని


వైసీపీలో ఇన్‌చార్జిల మార్పు తుది దశకు చేరింది. పార్టీలో గొడ‌వ‌ల కార‌ణంగా మూడో జాబితాని ప్ర‌స్తుతం వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది. కాగా, ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్దుల ఖరారు సంచలనంగా మారింది. గెలుపే ప్రామాణికంగా అభ్యర్దుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేస్తున్న పార్టీ అధినేత జ‌గ‌న్‌.. ప్ర‌కాశం జిల్లాలో సీట్ల ఖరారుపై చర్చల బాధ్యత పార్టీ సమన్వయకర్త సాయిరెడ్డికి అప్పగించారు. ఎంపీ మాగుంటకు సీటు లేదనే సంకేతాలు పార్టీ నుంచి కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి బాలినేని సీట్ల మార్పు పైన ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.

మార్పులపై ఆగ్రహం
ప్రకాశం జిల్లాలో అభ్యర్దుల ఖరారుపైన జగన్ సంచలన ప్రతిపాదనలు తెర మీదకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఎంపీ మాగుంటకు దాదాపు సీటు లేదనే పార్టీలో చర్చ జరుగుతోంది. ఒంగోలు ఎంపీ స్థానం నుంచి మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తిరిగి మాగుంటకు టికెట్‌ ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు. తాజా సర్వేల్లో మాగుంటకు పరిస్థితులు అనుకూలంగా లేవని సాయిరెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఒంగోలు లోక్ సభతో పాటుగా అసెంబ్లీకి కొత్త పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే ఆయన కుమారుడు విక్రాంత్‌రెడ్డిని ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారు..

జిల్లాలో స్థానాల మార్పు
ఒంగోలు నుంచి పోటీకి శిద్దా ససేమిరా అనడంతో ఆయన పార్టీలో ఉంటే గిద్దలూరు పంపించి ఒంగోలు నుంచి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను రంగంలో దింపితే ఎలా ఉంటుందన్న పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. దర్శి నుంచి పోటీకి శివప్రసాద్‌రెడ్డికి లైన్‌క్లియర్‌ చేసినట్లు చెబుతున్నారు. కందుకూరు నుంచి మహీధరరెడ్డి స్థానంలో యాదవ సామాజికవర్గం వారికి అవకాశం ఇచ్చేందుకు కొత్త పేర్లు పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. మాగుంటకు సీటు కోసం బాలినేని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే విజయ సాయిరెడ్డితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఒంగోలు దాటి ఇతర నియోజకవర్గాలకు తాను వెళ్లేది లేదని బాలినేని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. దీంతో, బాలినేనికి తిరిగి ఒంగోలు సీటు కేటాయించేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. కానీ, మాగుంట విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకోవాలని బాలినేని కోరినట్లు సమాచారం.

బాలినేని ఆగ్రహం
ఒంగోలు ఎంపీ మాగుంటకు సీటు దాదాపు లేదనే సమాచారంతో ఆయన టీడీపీతో టచ్ లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన తన అనుచర వర్గంతో సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ పైన వారి నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. బాలినేని సైతం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఆయన ప్రకాశం జిల్లాలో సీట్ల ఎంపిక విషయంలో కొంత ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. బాలినేనితో పాటుగా కలిసి వెళ్లి కొండేపీ, సంతనూతలపాడులో సమావేశాలు నిర్వహించాలని సాయిరెడ్డికి సీఎం జగన్ సూచించారు. ఈ మేరకు బాలినేనికి సాయిరెడ్డి ఆహ్వానించినా..బాలినేని తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు బాలినేని రాజకీయంగా ఏం చేయబోతున్నారు..ప్రకాశం వైసీపీలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement