Saturday, April 27, 2024

ప్ర‌భుత్వ నిర్ణయాలతో పోలవరం జాప్యం, పీపీఏ హెచ్చరికలు ప‌ట్టించుకోవ‌డం లేదు.. షెకావత్‌కు చంద్రబాబు లేఖ

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు, ఏకపక్ష నిర్ణయాల వల్ల పోలవరం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుందని అసమర్ద, ఉద్దేశపూర్వక నిర్ణయాలతో ప్రాజెక్టు భవితవ్యం ప్రమాదంలో పడిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఈ మేరకు కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు ఒక లేఖ రాశారు. ఏపీ పునర్‌విభజన చట్టం ప్రకారం పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఎంతో సహకరించిందని పేర్కొన్నారు. ఆర్డినెన్స్‌ ద్వారా ఏడు ముంపు మండలాలను ఏపీకి బదలాయించడం వల్ల ఏపీకి మేలు జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో తమ హయాంలో 71 శాతం ప్రాజెక్టు పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకంగా మార్చిందని లేఖలో కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో అవలంభిస్తున్న తీరును చూస్తుంటే తనకు ఎంతగానో ఆవేదన కలిగిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చడమే కాకుండా రివర్స్‌ టెండరింగ్‌ పేరిట పనులు నిలిపివేయడంతో ఆరు నెలల కాలం వృథా అయిందని తెలిపారు. కాంట్రాక్టర్‌ను మార్చే క్రమంలో వరద నిర్వాహణ పనులు చేపట్టలేదని, దీంతో డయా ఫ్రం వాల్‌ దెబ్బతిందని చంద్రబాబు వివరించారు. ప్రాజెక్టు పనులు సంతృప్తిగా సాగుతున్న సమయంలో కాంట్రాక్టర్‌ను మార్చాల్సిన అవసరం లేదని పీపీఏ ప్రభుత్వానికి సూచించినా ఏమాత్రం ఖాతరు చేయకుండా ముందుకు వెళ్లిందని లేఖలో ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ మార్పు, ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం ఆర్థిక భారాన్ని పెంచుతుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యం వల్ల సాగునీటి సరఫరా నదుల అనుసంధాన ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడ్డాయని వివరించారు.

2021 జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ అసెంబ్లి వేదికగా ప్రకటించారని ఇప్పుడు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ప్రకటిస్తున్నారని వివరించారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రమంత్రి షెకావత్‌ను చంద్రబాబు లేఖ ద్వారా కోరారు. ఈ లేఖతో పాటు కేంద్రం పలు సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సూచనలు, పీపీఏ మినిట్స్‌ కాపీలను కూడా జతచేసి పంపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement