Thursday, May 2, 2024

అధికారులు జస్టిస్ గోపాలగౌడ వ్యాఖ్యలు వినండి – జ‌న‌సేనాని..

అమ‌రావ‌తి – సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ ఇటీవల విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఏపీ ప్రభుత్వ పాలనపై నిశిత విమర్శలు చేశారు. అంతేకాదు అధికారులకు కూడా ఆయన హితవు పలికారు. పోలీసు డిపార్ట్ మెంటులో కొందరు ప్రైవేటు సైన్యంలా మారిపోయారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలను కారులోనే ఉండాలని, కారులోంచి కదలొద్దని ఆదేశిస్తున్నారని విశాఖలో జనసేనాని పవన్ కల్యాణ్ కు ఎదురైన పరిస్థితిని ప్రస్తావించారు.

దీనిపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ. ఏపీలో వైసీపీ అరాచక పాలనపై జస్టిస్ గోపాలగౌడ చేసిన వ్యాఖ్యలను అధికారులు సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. ఏపీలో అధికారులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న తీరును అత్యున్నతస్థాయిలో ఉన్న వ్యక్తులు స్పష్టంగా గమనిస్తున్నారని పవన్ పేర్కొన్నారు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటుంటుందని, చేసినదానికి అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. “మీరు ఏ విత్తనం వస్తే ఆ పంటే పండుతుంది. వైసీపీ ప్రభుత్వాన్ని గుడ్డిగా సపోర్ట్ చేస్తున్న ప్రతి అధికారి ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను” అంటూ పవన్ ట్వీట్ చేశారు. జస్టిస్ గోపాలగౌడ వ్యాఖ్యల వీడియోను ప‌వ‌న్ త‌న ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement