Thursday, May 9, 2024

Paul Punches: విభజన హామీలు అమలుచేయాలి.. మౌనదీక్ష చేస్తానన్న కేఏ పాల్​

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ మౌనదీక్ష చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు. బుధవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, జులై 16న రాజ్‌ఘాట్‌లో గాంధేయమార్గంలో మౌనదీక్ష ద్వారా నిరసన తెలియజేస్తానని వెల్లడించారు. విభజన హామీల అమలు కోసం తనతో కలిసి రావాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహాన్ రెడ్డి, కే. చంద్రశేఖర రావుతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల, ప్రవీణ్ కుమార్, కోదండరాం సహా అన్నిపార్టీల నేతలను ఆహ్వానించినట్టు కేఏ పాల్ తెలిపారు.

తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఢిల్లీలో మౌనదీక్ష కోసం అవసరమైతే ముఖ్యమంత్రులకు ప్రత్యేక విమానాలు పంపిస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, తెలంగాణకు అభివృద్ధి ప్యాకేజి ఇవ్వాలని కేఏ పాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సీబీఐ కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డారని విమర్శించారు. ఇటు తెలంగాణలో కేసీఆర్ భారతీయ జనతా పార్టీకి బీ-టీమ్‌గా మారారని ఆరోపించారు.

తనను తెలంగాణకు ముఖ్యమంత్రిని చేస్తే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తానని కేఏ పాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి దేశానికి ప్రధాని అయ్యే అవకాశం వస్తుందని, ప్రజాశాంతి పార్టీ సత్తా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని ప్రజలను కోరారు. కేసీఆర్ అవినీతిపై సీబీఐ దర్యాప్తుకు రెడీ అవుతోందని, విచారణకు అవసరమైన ఆధారాలను సీబీఐ సేకరిస్తోందని కేఏ పాల్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement