Thursday, May 2, 2024

గ్రామ, వార్డు సచివుల్లో ఓటీఎస్‌ గుబులు.. 82 కోట్లమేర పెండింగ్‌ బకాయిలు

అమరావతి, ఆంధ్రప్రభ: గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో ఇళ్ల క్రమబద్దీకరణకు సంబంధించి ఓటీఎస్‌ వసూళ్ల అంశం ఆందోళన రేపుతోంది. ఈక్రమంలోనే ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్‌ డిక్లరేషన్‌కు ఓటీఎస్‌ వసూళ్లకు లింకు పెట్టిందంటూ ప్రచారం జరుగుతుండటంతో సచివాలయ ఉద్యోగులు మరింత ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్‌ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోలో ఇందుకు సంబంధించిన ఎటువంటి నిబంధన పొందుపర్చలేదు.

కానీ, ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఓటీఎస్‌కు సంబంధించి వసూలు చేసిన రూ. 82.46 కోట్లమేర పెండింగ్‌ బకాయిలు ఉన్నాయని, వాటిని సత్వరమే చెల్లించాలని ఆదేశించారని అంటున్నారు. ఇదే క్రమంలో ప్రతి సచివాలయ ఉద్యోగి తన పరిధిలోని ఇళ్ల క్రమబద్దీకరణకు సంబంధించిన ఓటీఎస్‌ విధానాన్ని తూ.చ.తప్పకుండా అమలుచేసేలా చూడాలని చెప్పారని అంటున్నారు. ఆక్రమంలోనే అన్ని జిల్లాల్లోనూ మున్సిపల్‌ కమిషనర్ల ఒత్తిడి మేరకు కొంత మంది ఉద్యోగులు తమ లాగిన్‌లో రూ. 5 వేలు, రూ. 10 వేల వంతున చలనాలు జనరేట్‌ చేశారని, ఆమేరకు అవన్నీ బకాయిలుగా కనిపిస్తున్నాయని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

లబ్దిదారుడు చెల్లించకుండానే చలాన్లు జరేట్‌ చేయడం వల్ల ఈ ఇబ్బందులు ఎదురయ్యాయని, ఈమొత్తాన్ని ఇంటి యజమాని నుండి వసూలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి జరిగిన విషయాన్ని కూలకుశంగా ఆయనకు వివరించి కొంత మేర సమయం ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజలెవరూ వీటిని క-్టటొ-ద్దని, తాము అధికారంలోకి వచ్చి ఓటీ-ఎస్‌ ను రద్దు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే వసూళ్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో అన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది.

అసలేం జరిగిందంటే :
ప్రభుత్వం పేదల నుంచి నిర్దేశిత రుసుములు వసూలు చేసి వారి పేర్లతో ఇంటికి రిజిస్ట్రేష్రన్‌ చేయించే బాధ్యతను గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు అప్పగించింది. ఇందులో భాగంగా వారికి ఈవసూళ్లను అప్పగించింది. ఏ సచివాయల పరిధిలో ఆ సచివాలయ ఉద్యోగులు లక్ష్యాలను అందుకునేలా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షణ కోసం బాధ్యులను ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో జూలై నుంచి సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ ఖరారు చేయనున్న దశలో జూన్‌ 16న ఆయా శాఖల ఉన్నతాధికారులు కలెక్టర్లతో సీఎస్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటీఎస్‌ గురించి ఆరా తీశారు. ఇంకా రూ. 82.46 కోట్లు- రావాల్సి ఉందని అధికారులు సీఎస్‌కు వివరించారు. దీంతో జిల్లాల వారీగా లెక్కలు పంపుతున్నామని, ఏ జిల్లాలో వసూలు కావాల్సి ఉందో వేగంగా తేల్చాలని సీఎస్‌ ఆదేశించారు.

- Advertisement -

ఆ ప్రచారంలో వాస్తవం లేదు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ షాకిచ్చిందంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు జానీపాషా చెప్పారు. కొన్ని చోట్ల కొన్ని పరిస్థితుల నేపథ్యంలో సచివులు తమ లాగిన్‌లో చలాన్లు జరేట్‌ చేసినమాట వాస్తవమే అయి ఉండవచ్చని తెలిపారు. దీనిని సరిదిద్దేందుకు ప్రభుత్వం నుండి ఒకటి లేదా రెండు నెలల సమయం కోరనున్నట్లు చెప్పారు. ఇళ్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఓటీ-ఎస్‌ లెక్కలు తేల్చితేనే వారి ప్రొబేషన్‌ ను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్న వార్తలను ఆయన ఖండించారు. ప్రొబేషన్‌ ఖరారయితే తమ ఉద్యోగాలు పర్మినెంట్‌ అవుతాయని ఉద్యోగులు ఆనంద పడుతుండగా, ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడం ద్వారా ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతినే ప్రమాదముందన్నారు. అసత్య ప్రచారాలను సచివాలయ ఉద్యోగులు నమ్మవద్దని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement