Thursday, May 2, 2024

కాపులకు ఓబీసీ రిజర్వేషన్లు.. పార్లమెంట్‌లో జీవీఎల్ డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే కాపులకు ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. పార్లమెంట్‌ జీరో అవర్‌లో కాపుల రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తారు. ఏపీలో కాపులు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన సమాజమని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి కాపులు విశేష కృషి చేసినా రాష్ట్ర జనాభాలో 18% ఉన్న కాపులకు అభివృద్ధి ఫలాలు మాత్రం అందడం లేన్నారు. బ్రిటిష్ పాలనలో, కాపులను వెనుకబడిన తరగతులుగా పరిగణించినా 1956లో నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాబితా నుండి వారిని తొలగించారని జీవీఎల్ గుర్తు చేశారు. 1956 నుంచి కాపులకు రాజకీయంగా అధికారం లేదన్న కారణంగా అన్ని ప్రభుత్వాలూ అన్యాయం చేశాయని ఆరోపించారు. దశాబ్దాలుగా కాపులు రిజర్వేషన్ల కోసం తీవ్ర రాజకీయ ఆందోళనలు చేస్తున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు.

2017లో ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వోద్యోగాల్లో కాపులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ బిల్లు 2017ను ఏపీ అసెంబ్లీ ఆమోదించిందన్నారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నప్పటికీ బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపడం అనవసరమన్న జీవీఎల్‌ఎన్ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సొంతంగా చర్యలు చేపట్టవచ్చని సూచించారు. ముస్లిం రిజర్వేషన్ బిల్లును సమ్మతి కోసం కేంద్రానికి పంపని ప్రభుత్వం కాపుల బిల్లును మాత్రం పంపిందని, కేంద్ర ప్రభుత్వాన్ని దీనికి బాధ్యులను చేయాలన్నదే వారి ఉద్దేశమని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులను నియమించి బీజేపీ తన నిబద్ధతను చాటుకుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు వెంటనే రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహాన్నిఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement