Monday, May 6, 2024

Spl Story: చిక్క‌దు, దొర‌క‌దు.. ముప్పుతిప్ప‌లు పెడుతున్న బెంగాల్ టైగ‌ర్‌!

కాకినాడ జిల్లా ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది బెంగాల్ టైగ‌ర్‌. ఫారెస్ట్ ఆఫీస‌ర్లు, సిబ్బంది ఎన్ని ప్లాన్లు వేసినా వారి అంచ‌నాల‌కు అంద‌కుండా, బోనుకు చిక్క‌కుండా త‌ప్పించుకుంటోంది. అటు అధికారులను, ఇటు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. మొన్నటిదాకా ప్రత్తిపాడు మండలంలో 5 గ్రామాల ప్రజలను భ‌య‌పెట్టిన ఈ పెద్దపులి.. ఇప్పుడు శంఖవరం మండలం వజ్రకూటం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుండ‌డంతో ఆ గ్రామ ప్రజలు వణికిపోతున్నారు.

రెండు రోజుల క్రితం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఆటోను అటాక్ చేయడంతో మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఒక ఇంటి గేటుపై పులి కాలితో గీరిన గుర్తులు కూడా ఫారెస్ట్ ఆఫీస‌ర్లు గుర్తించారు. ఇక‌.. ప‌గ‌టి పూట‌ అయినా కత్తిపూడి నుండి వజ్రకూటం వెళ్లే రహదారి జ‌నాల‌ భ‌యంతో నిర్మానుష్యంగా మారింది. ఏ క్షణంలో పులి అటాక్ చేస్తుందోనని పొలం పనులకు కూడా వెళ్లడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు మాత్రం వజ్రకూటం, నెల్లిపూడి రిజర్వ్ ఫారెస్ట్ లోనే పులి సంచరిస్తోంద‌ని అంటున్నారు. సోమవారం పులికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు తెలిపారు. పులి సంచరిస్తున్న చుట్టుప‌క్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు.

కాకినాడ జిల్లాలోని గ్రామాల్లో సంచరిస్తున్న పెద్దపులి

అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్ర‌హం..
వజ్రకూటం గ్రామస్తులు మాత్రం పులిని పట్టుకునే విషయంలో అటవీశాఖ అధికారుల నిర్ల‌క్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్‌ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. 20 రోజుల నుంచి పులిని ప‌ట్టుకోవ‌డంలో ఎందుకు లేట్ చేస్తున్నార‌ని ప్రశ్నిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఏ ప్రాంతంలో పులి తిరుగుతుందో కనిపెట్టాలని కోరుతున్నారు. అసలు అధికారులకు పులిని పట్టుకునే ఉద్దేశం ఉందా లేదా? లేకపోతే మాకు చెప్పండి మేం చూసుకుంటామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజుకారోజు కూలీనాలీ చేసుకుని బ‌తుకులు వెళ్ల‌దీసే తాము పులి భయంతో పనులకు వెళ్ల‌లేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాకినాడ జిల్లాలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న బెంగాల్​ టైగర్​

అంతేకాకుండా సాయంత్రం వేళ‌ పాడి పశువుల దగ్గర నుండి కత్తిపూడికి పాలు తీసుకెళ్లాలంటే భయంగా ఉంద‌ని అంటున్నారు. రెండు రోజులుగా పాలు అట్లాగే ఉండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు పులి విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పట్టుకొని ప్రజలు కాపాడాలని వేడుకుంటున్నారు. కాగా, పులి ఆచూకీ ఎక్కడ ఉందో తెలిసే దాకా ప్రజలెవరూ బయటకు రావద్దని వజ్రకూటం సర్పంచ్ గుర్రాజు గ్రామంలో దండోరా వేయించారు. పులి నెల్లిపూడి, వజ్రకూటం సరిహద్దుల్లో ఉన్నట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.

ఫారెస్ట్​ ఆఫీసర్లు ఏర్పాటు చేసిన బోను వద్దకు వచ్చి తిరిగి వెళ్లిపోతున్న పెద్దపులి
Advertisement

తాజా వార్తలు

Advertisement