Tuesday, May 21, 2024

ఈ దాహం తీర‌నిది…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల లో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ వాటికి సమీపం లోని పలు గ్రామాల్లో మాత్రం బిందెడు నీటి కోసం పల్లెవాసులు కటకటలాడాల్సి వస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించి అవసరమైన నీటిని నిల్వలు చేయడంలో ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్న అధికారులు వేసవికాలంలో మంచినీటి సమస్యలు తలెత్తే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోలేకపోతున్నారు. మంచినీటి ఎద్దడి నుంచి గట్టెక్కించేలాగా కనీసం తాత్కాలికంగా అయినా అవసరమైన ఏర్పాట్లు చేపట్టడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది గ్రామాల్లో మంచినీటి కోసం ప్రజలు మైళ్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన దుర్భర పరిస్థితులు దర్శన మిస్తున్నాయి. ఏప్రిల్‌ మాసం ముగుస్తుండడం, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. అల్పపీడన ద్రోణులవల్ల ఒకటీ అరా వర్షాలు కురిసినా వేసవితాపం నుంచి ఉపశమనం తప్ప నీటిఎద్దడికి పరిష్కారం కాదు. అనేక ప్రాంతాలలో మంచినీటి పథకాలు అటకెక్కుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మరమ్మతులకు గురవుతున్నాయి. ఇలా అనేక ప్రాంతాల్లో వివిధ సమస్యలతో ప్రజలకు సకాలంలో మంచినీరు లభించడం లేదు.


ఇప్పుడెలా?
మే మాసంలో మరెన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కనిపిస్తున్నా అధికారులు మాత్రం ఆ దిశగా ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో మే మాసాన్ని తలచుకుంటూ ప్రజలు వణికిపోతున్నారు. మంచినీటి సమస్యను ఎదుర్కొం టున్న గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు ఏటా విఫలం అవుతూనే ఉన్నారు. ఫలితంగా మార్చి నెల నుండే రాష్ట్రవ్యాప్తంగా వందలాది గ్రామాల్లో మంచినీటికోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లెక్కి ఆందోళనకు దిగాల్సి వస్తోంది. ఈ ఏడాది కూడా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇప్పటికే మహిళలు ధర్నాలు, నిరసనలు చేపడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటితోనే సర్దుకుపోవాల్సి వస్తోంది. మరికొన్ని ఊర్లలో అయితే రెండు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా అవుతోంది. పట్టణ ప్రాంతాల్లో సైతం మంచినీటి పథకాలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం, మరికొన్ని పథకాలు అటకెక్కినా వాటిని దీర్ఘకాలంగా మరమ్మతులు చేయించకపోవడంతో వేసవి వచ్చిందంటేనే పట్టణ ప్రజలు కూడా మంచినీటికోసం కటక టలాడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి తాగు నీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేయ డంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో సుజల స్రవంతి పథకం ద్వారా నాణ్యమైన నీటిని అందించేలా ఏర్పాట్లు చేసింది. అందు కోసం ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయిస్తోంది. వేసవికి ముందే మంచినీటి సమస్య ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పదేపదే ఉన్నతాధికారులు ఆయా జిల్లాలకు చెందిన అధికారులకు సూచిస్తున్నారు. సీఎం జగన్‌ సైతం సమీక్షల్లో మంచినీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా కొంతమంది అధికారులు ఆదిశగా దృష్టిసారించడం లేదు. దీంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు.

సీమలో ఇదీ సీన్‌
రాయలసీమ జిల్లాలో మంచినీటి సమస్య తీవ్ర స్థాయికి చేరుతుంది. అనేక గ్రామాలు గుక్కెడు నీటి కోసం విలవిలలాడే పరిస్థితులు దాపురించబోతున్నాయి. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల్లో అనంతపురం జిల్లా ఒకటి. ఈ ప్రాంతంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అయితే, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలోనూ వాటిని ఆచరణలో అమలు పర్చడంలోనూ అధికారులు విఫలమవుతున్నారు. దీంతో వేసవి వచ్చిందంటే ట్యాంకర్లపైనే మంచినీటికోసం ఆధారపడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. గతంలో ట్యాంకర్లకు సంబంధించిన బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లు ముందుకు రావడం లేదు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement