Saturday, May 18, 2024

‘టిడ్కో ఇళ్లపై’ క్లారిటీ లేదు..!

విజయనగరం, (ప్రభ న్యూస్‌) : చంద్రబాబు నేతృత్వంలోని గత టీడీపీ ప్రభుత్వ హయాం అచేతనత్వం టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టిడ్కో) ఇళ్ల లబ్ధిదారులకు శాపంగా మారింది. అప్పట్లో లబ్ధిదారులైన వారిలో ఎంత మంది ప్రస్తుత జాబితాలో వున్నారు? అసలు ఇళ్ల లబ్ధి ఎప్పటికి చేకూరుతుంది? వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన బంపర్‌ ఆఫర్‌ ఎంతమందికి లబ్ధి చేకూర్చింది? వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కరువైంది. ఒక్క మాటలో చెప్పాలంటే టిడ్కో ఇళ్లపై స్వయంగా ముఖ్యమంత్రి సమీక్ష జరిపినా తప్పుడు నివేదికలే సమర్పిస్తారు తప్ప మన అధికారగణం వద్ద వాస్తవ సమాచారమన్నది లేదు.

అన్నింటికీ మించి 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులు ఇళ్ల లబ్ధిదారుల నుంచి ఎంత మొత్తం వసూలు చేశారు? చంద్రబాబు ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలో 50శాతం చెల్లిస్తే చాలన్న వైసీపీ ప్రభుత్వ ఆఫర్‌ను అనుసరించి అప్పటికే మొత్తం చెల్లించిన ఎంతమందికి ఆ 50 శాతం చెల్లించారు? వంటి వివరాలేవీ అటు మున్సిపల్‌ అధికారుల వద్ద గానీ ఇటు టిడ్కో అధికారుల వద్దగానీ లేవు అంటే నమ్యశకం కాకున్నా నమ్మక తప్పదు.

గతనెల 20న జిల్లా కలెక్టర్‌ స్వయంగా నిర్వహించిన సమీక్షలో కూడా పైన పేర్కొన్న ప్రశ్నలకు సమాధానాలు లేవన్నది బయటివారికి తెలియకపోయినా సమీక్ష జరిపిన సర్వోన్నతాధికారికి తెలియనిది కాదు. ఈనేపథ్యంలో లబ్ధిదారుల గందరగోళ పరిస్థితులకు తెరదించేది ఎవరు? అన్నది బిలియన్‌ డాలర్ల ప్రశ్న. 50 శాతం తిరిగి చెల్లింపుల విషయంలో మున్సిపల్‌ అధికారులు వివక్ష చూపారన్న ఆరోపణలు కూడా వున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే రూ.1,00,000/-, రూ.50,000/- చొప్పున చెల్లించిన లబ్ధిదారుల్లో చాలా మందికి జగన్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆఫర్‌ లబ్ధి చేకూరలేదు.

అదలా వుంచితే…సర్వం సిద్ధం..ఇక లబ్ధిదారులకు ఇళ్లను అందజేయడమే అన్న భ్రమ కలిగించిన గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగానే వైసీపీ ప్రభుత్వం కూడా లబ్ధిదారులను ఊరిస్తున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 60 నుంచి 70 శాతం పూర్తయిపోయయి అనుకున్న టిడ్కో ఇళ్లకు నేటికీ అతీగతీ లేకపోవడం లబ్ధిదారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలోని ఏకైక నగర పంచాయతీ నెల్లిమర్ల, ఏకైక నగరపాలక సంస్థ విజయనగరంతో పాటు మూడు మున్సిపాలిటీలు పార్వతీపురం, బొబ్బిలి, సాలూరులో మొత్తంగా 9740 మందికి ఇళ్ల లబ్ధి చేకూర్చాల్సి వుందన్నది నాటి అధికారిక నివేదికల సారాంశం.

ఇపుడు ఆ సంఖ్య 8048గా టిడ్కో అధికారులు చెబుతున్నారు. ఆ లెక్కల ప్రకారం విజయనగరం నగరపాలక సంస్థ పరిధికి సంబంధించి 3776, నెల్లిమర్ల నగర పంచాయతీకి సంబంధించి 576, సాలూరు మున్సిపాలిటీకి సంబంధించి 1248, బొబ్బిలి మున్సిపాలిటీకి సంబంధించి 1680, మిగతావి పార్వతీపురం మున్సిపాలిటీకి సంబంధించినవిగా అంచనా వేసుకోవాలి. వాస్తవ లెక్కలేంటి? అన్నవి భగవంతునికే తెలియాలి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించిన టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల జాబితాను పారదర్శకంగా వెళ్లడించాలని, నిర్దేశిత మొత్తాన్ని ముందుగా చెల్లించిన వారిలో ఇంత వరకు 50 శాతం వెనక్కి జమకాని వారికి వెంటనే ఆమొత్తం జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధిక సంఖ్యాకులు కోరుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement