Friday, May 3, 2024

New Voters – మరో నాలుగు రోజులే…కొత్తగా ఓటు నమోదుకు ఈసీ అవకాశం

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం అని అంటారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉంది. సోమవారంలోగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకుగాను ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఎన్నికల అధికారులు పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఓటు హక్కుపై అవగాహనా సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు మరింత సమయం ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల తుది జాబితాను మొదట ఫిబ్రవరి 8న ప్రకటించారు. కాని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు మరింత సమయం ఇచ్చారు అధికారులు. ఫిబ్రవరి 8 నుంచి ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లతో తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించనున్నారు.

నిరంతర ప్రక్రియ..
రాష్ట్రంలో ఏప్రిల్‌ 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈలోగా జాబితాలో ఓటు ఉందో ? లేదో ? పరిశీలించుకుని.. లేని పక్షంలో నమోదు చేసుకోవాలని సూచించింది. ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చిన వారు లేదా ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ ఏటా జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబరు నెల ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎన్నికల సంఘం ప్రకటించి ఎప్పటికప్పుడు జాబితాలు వెలువరిస్తోంది.

- Advertisement -

మార్పులు చేర్పులు చేసుకోవచ్చు..
2006 మార్చి 31లోగా పుట్టిన వారు తమ పేరును ఓటర్ జాబితాలో నమోదు చేసుకునేందుకు ఫాం -6లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఫాంతోపాటు వయస్సు ధృవీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో జతచేసి బూత్ లెవల్ ఆఫీసర్ కు అందించాల్సి ఉంటుంది. ఓటరు జాబితాలో పేరు గల్లంతైన వారు ఈ ఫాం 6 ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. తాజాగా జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. అందులో పేరు లేనివారు కొత్తగా నమోదు చేసుకోవాలనుకునే వారు ఫారం-8 దరఖాస్తును ఆన్‌లైన్‌లో లేదా నియోజకవర్గ ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారి లేదా పోలింగ్‌ కేంద్రం అధికారికి ప్రత్యక్షంగానైనా అందజేయవచ్చు. మార్పుచేర్పులకూ అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటు నమోదు చేసుకునేందుకు.. https://nvsp.in, https://ceotelangana.nic.in , https://voters.eci.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement