Friday, April 26, 2024

అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులు..! మూడు దశల్లో పనులు..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులు సమకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న సర్కార్‌ ఇప్పుడు వాటిలో సౌకర్యాల కల్పన ఆధునీకరణపై దృష్టి సారించింది. అలాగే కొత్త కేంద్రాల నిర్మాణానికి కసరత్తును మొదలుపెట్టింది. ఆధునీకరణ ఉట్టిపడేలా అంగన్‌వాడీ కేంద్రాలను రూపుదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి ముందుకు సాగుతోంది. ఒకవైపు చిన్నారులకు బోధన, సమతుల్య ఆహారం పంపిణీతో పాటు గర్భిణీలకు అన్ని వసతులు ఒకేచోట లభించేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలను దశలవారీగా సొంత భవనాల్లోకి మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రీ స్కూళ్లలో బోధన అత్యంత సులువుగా ఇంగ్లీష్‌ మీడియంలో సాగించేందుకు అవసరమైన కిట్లను ఇప్పటికే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. మరోవైపు బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారాన్ని, పాలు, ఇతర మందులను అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అందించే దిశగా చర్యలు తీసుకుంది. అంగన్‌వాడీల అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రత్యేక కమిటీలను నియమిస్తూ ముందుకు సాగుతుంది. ఏడుగురు సభ్యులతో కమిటీలను నియమించింది. మొత్తం మూడు దశల్లో అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, ఆధునీకరణ పనులు సాగేలా ప్రణాళికలను శిశుసంక్షేమ శాఖ రూపొందించింది. కొత్త భవనాల నిర్మాణం, ఆధునీకరణ పనుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందింది. రాష్ట్రంలో తొలి దశలో కొత్తగా 3 వేల 500 అంగన్‌వాడీలకు కొత్త భవనాలు నిర్మించనున్నారు. ఒక్కొక్క భవనాన్ని రూ. 14 లక్షల నిధులతో నిర్మించనున్నారు. ప్రీ స్కూళ్లుగా మారిన నేపథ్యంలో విశాలమైన ప్రాంగణం ఉండేలా శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనను రూపొందించింది. ఒక్కొక్క భవనం దాదాపు 820 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం కానుంది.

ఈ నిర్మాణంలో బోధనా సాగించేందుకు గదులతో పాటు వంట గది, టాయిలెట్లు, ఆటస్థలం ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. అన్ని ఆధునిక హంగులతో నిర్మాణం చేయనున్న భవనాలకు ప్రహరీ గోడను కూడా నిర్మించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ నిధులతో అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రహరీ గోడను నిర్మిస్తారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వమే ప్రహరీ గోడకు అవసరమైన నిధులను ఇస్తుంది. రాష్ట్రంలో అంగన్‌వాడీ భవనాలను పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తొలిదశలో 16 వేల 700 భవనాలను ఆధునీకరించనున్నారు. ఒక్కొక్క అంగన్‌వాడీ కేంద్రం ఆధునీకరణకు రూ. 6 లక్షల 40 వేలను ప్ర భుత్వం కేటాయించనుంది. ఈ నిధులతో అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. గత ఏడాదే అంగన్‌వాడీ భవనాల ఆధునీకరణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా.. కోవిడ్‌ థర్డ్‌వేవ్‌తో పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. ప్రస్తుతం పరిస్థితులు చ క్కబడటంతో మళ్లి ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఒకవైపు భవనాలకు రంగులు వేస్తుండటంతో పాటు అవసరమైన మరమ్మతులు చేపట్టారు. పిల్లలకు అవసరమైన క్రీడా ఉపకరణాలు, ఇతర సౌకర్యాలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వినియోగించనున్నారు. ఇదే సమయంలో అంగన్‌వాడీ టీచర్లకు ఇప్పటికే సమగ్రమైన శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. కాలానికి అనుగుణంగా బోధన సాగించేందుకు అవసరమైన శిక్షణను ఇస్తోంది. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో అన్ని అంగన్‌వాడీలకు సొంత భవనాలు ఉండేలా ప్రభుత్వం నిర్థిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement