Saturday, May 4, 2024

Agriculture | వేరుశెనగ, మొక్కజొన్నకు కొత్త వంగడాలు

అమరావతి, ఆంధ్రప్రభ: మరో పది రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ముగిసి రబీ ప్రారంభమవుతున్న దృష్ట్యా తక్కువ నీటి వినియోగం, తక్కువ విస్తీర్ణం, తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడి ప్రయోజనాలిచ్చే వంగడాల వినియోగంపై రైతులు దృష్టి కేంద్రీకరించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సరిపడా నీటి లభ్యత లేక ఖరీఫ్‌లో సాగు కష్టమైన నేపథ్యంలో రబీలో విత్తు నుంచి విక్రయం దాకా రైతులకు పూర్తిస్థాయిలో సహకారం అందించేలా ప్రభుత్వం అదికారులకు దిశా నిర్దేశం చేసింది.

ఈ మేరకు కొత్త వంగడాల తయారీని ప్రోత్సహించటంతో పాటు ఎక్కడికక్కడ రైతులే విత్తనోత్పత్తి చేసుకునే దిశగా ప్రభుత్వం గడిచిన కొంతకాలంగా సహకారం అందిస్తోంది. దేశీయంగానే కాక అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందిన రాష్ట్రంలోని మార్టేరు, బాపట్ల వరి వంగడాల వినియోగంతో సాధారణ సాగు ఇబ్బందులను చాలా వరకు అధిగమించవచ్చనీ, నీటి వినియోగం తక్కువగా ఉండటంతో పాటు పెట్టుబడి కూడా తగ్గి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాస్త్త వేత్తలు చెబుతున్నారు.

మార్టేరు, బాపట్ల వంటి వరి వంగడాలతో పాటు ఇతర పంటలకు సంబంధించి 43 వంగడాలను రైతులు సొంతంగా తమ భూమిలోనే విత్తనోత్పత్తి చేసుకునేందుకు సహకారం అందించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నేల స్వభావాన్ని బట్టి మార్టేరు, బాపట్లతో మరో మూడు వరి వంగడాలను వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఎంటీయూ-1224 (మార్టేరు సాం), ఎంటీయూ-1262 (మార్టేరు మసూరి), ఎంటీయూ-1210 (సుజా), బీపీటీ -2595 (తే), ఎన్‌ఎల్‌ఆర్‌-3354 (నెల్లూరు ధాన్యరాశి) వరి వంగడాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నేల స్వభావానికి అనుగుణంగా ఉన్నట్టు పరిశోధనలో తేలింది.

- Advertisement -

ఎంటీయూ-1223 (వ), ఎంటీయూ-1239 (శ్రావణి) వంగడాలను కూడా దేశీయంగా వాడుతున్నారు. ఏ సీజన్‌ లో ఏ వంగడాన్ని వినియోగించాలి.. నేల స్వభావం ఆధారంగా ఏ వంగడాన్ని ఎంచుకోవాలి.. విత్తనోత్పత్తి చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళుకువలపై రైతులకు పూర్తిస్థాయిలో పొలంబడుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

రబీలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి

రబీ సీజన్‌ లో వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఇతర పంటలపై దృష్టి పెట్టేలా వ్యవసాయ పరిశోధనా సంస్థలు, కృషీ విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ యూనివర్శిటీల్లోని శాస్త్రవేత్తలు వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాన్నీ, అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల వంగడాలను సూచిస్తున్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విస్తరణ కేంద్రం వేరుశెనగ సాగుకు సంబంధించి రైతులకు ప్రత్యేక సూచనలు అందిస్తోంది.

వేరుశెనగ సాగులో కేవలం 122 రోజుల పంట కాలంలో ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి నిచ్చే కదిరి లేపాక్షి (కె.182) వంగడం బెట్ట, తెగుళ్లను బాగా తట్టుకుని నిలబడుతున్నట్టు గుర్తించారు. కదిరి అమరావతి (2016), కదిరి చిత్రావతి, కదిరి 7 బోల్ట్‌, కదిరి 6, కదిరి 9, కదిరి హరితాంద్ర, ధరణి తదితర వంగడాలను కూడా నేల స్వభావాన్ని బట్టి వినియోగించాల్సి ఉంటుంది. రబీలో మొక్కజొన్న సాగుకు కూడా సూచనలు అందిస్తున్నారు.

మొక్కజొన్నను వచ్చే ఏడాది జనవరి 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది.. నేల స్వభావాన్ని బట్టి ఎకరానికి 26,666 నుండి 33,333 మొక్కల సాంద్రత ఉండాలి.. సయాట్రినిప్రోల్‌, థయోమిథాక్సామ్‌ మందును 4 మి.లీ. కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేస్తే మొక్క తొలిదశలో వచ్చే పురుగులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రబీ సీజన్‌ లో అనుకూల సాగుగా ఉన్న జొన్నకు సంబంధించి నేల స్వభావాలు, పంట కాల పరిమితి ఆధారంగా ఎన్‌టీజే 4, ఎన్‌టీజే 5, ఎన్‌ 15, సీఎస్‌వీ 216, ఆర్‌సీఎస్‌వీ 14, ఆర్‌ఎం 35-1, సీఎస్‌వీ 18, సీఎస్‌వీ 22 వంగడాలను సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement