Saturday, May 4, 2024

సచివాలయాలకు కొత్త బాస్‌లు.. ఇప్పటివరకు జేసీల పర్యవేక్షణ

అమరావతి, ఆంధ్రప్రభ : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల బాధ్యతలను పూర్తిస్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకే అప్పగించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ కసరత్తు త్వరలోనే ఒక కొలిక్కివచ్చే అవకాశముందని, త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్న మొన్నటిదాకా వీటి పర్యవేక్షణకు ప్రత్యేకంగా జేసీని నియమించిన సంగతి తెలిసిందే.

తాజాగా జిల్లాల విభజనతో జేసీ పోస్టును రద్దు చేశారు. దీంతో గ్రామ సచివాలయాలను జిల్లా పరిషత్‌(మండలాలవారీగా ఎంపీడీవోల)కు, వార్డు సచివాలయాలను మున్సిపల్‌ శాఖకు పూర్తిగా అప్పగించేందుకు కసరత్తు మొదలైంది. ఇదే అంశంపై ప్రభుత్వం జిల్లా యం త్రాంగానికి సూచనప్రాయంగా తెలియజేసినట్లు సమాచారం. ఇన్నాళ్లూ స్వతంత్రంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఇక నుండి ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషన్ల ఆధీనంలో ఉండనున్నారు. పరిపాలన, సేవా పుస్తకం వంటివి వారికే అప్పగించే అవ కాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకుంటారని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement