Saturday, April 27, 2024

ఎర్ర దందా.. ఒకరాత్రికి వంద టిప్పర్లు తరలింపు.. స్మగ్లర్లతో కుమ్మకైన అధికారులు

దొరవారిసత్రం, (ప్రభన్యూస్‌) : ప్రకృతి సంపదను దోచుకునే వారు ఎంతటి వారైనా విడిచి పెట్టవద్దు.. ఇసుకు, గ్రావెల్‌, మట్టి స్మగ్లింగ్‌కు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేయండంటూ సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి పదేపదే సూచిస్తున్నారు. ఇక గనులు, భూగర్భ శాఖ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదే తరహాలో అధికారులకు చెబుతూ వస్తున్నారు. అయినా కొంతమంది అవినీతి అధికారుల తీరువల్ల ప్రభుత్వ ఆశయం నీరుగారి పోతుంది. అడ్డగోలుగా ప్రకృతి సంపదను కొంతమంది ఎర్రదొంగలు దర్జాగా దోచుకు వెళుతున్నారు. దొరవారిసత్రం మండల పరిధిలోని ఆనేపూడి గ్రామం నుండి ప్రతిరోజు రాత్రివేళల్లో పంటపొలాలను హిటాచీలతో తవ్వి ఆ పొలాలలోని గ్రావెల్‌ను టిప్పర్లతో సూళ్లూరుపేటలోని ఓ ప్రైవేటు పరిశ్రమకు తరలిస్తున్నారు. అనేపూడి గ్రామం నుండేకాక దొరవారిసత్రం మండలంలోని మరో రెండు ప్రాంతాల నుంచి ఈ అక్రమ గ్రావెల్‌ దందాను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 20కి పైగా టిప్పర్లతో ఈ గ్రావెల్‌ను తరలిస్తుండగా ఒక్కో టిప్పర్‌ గ్రావెల్‌ ధర ఆ పరిశ్రమలో రూ.10వేల వరకు పలుకుతుంది. దీంతో నువ్వా.. నేనా అన్నట్లుగా స్మగ్లర్లు ఒక్కో టిప్పర్‌తో రోజుకు ఐదు ట్రిపుల వరకు గ్రావెల్‌ను తరలిస్తున్నారు. దీంతో సుమారుగా దొరవారిసత్రం మండలం నుంచి వంద ట్రిప్పుల వరకు అక్రమంగా ఆ పరిశ్రమకు ఎర్ర బంగారం తరలివెళుతుంది.

రైతులకు రూపాయి ఆశచూపి..

గ్రావెల్‌ స్మగ్లర్లు ప్రధానంగా అసైన్‌మెంట్‌ భూములు కలిగి ఉన్న మెట్ట రైతులను ఎంచుకుని వారికి రూపాయి ఎరవేసి వారి భూములను కొనుగోలు చేసి ఆ భూముల నుంచి గ్రావెల్‌ను తవ్వి తరలిస్తున్నారు. భూములు కలిగిన రైతుకు ఒక టిప్పర్‌కు వెయ్యి రూపాయలు ఇచ్చి నోరుకొట్టి తాము మాత్రం ఒక టిప్పర్‌ను రూ 10వేలకు విక్రయిస్తూ ఒక్కరాత్రిలోనే లక్షలు గడిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామస్తులు అడ్డుకున్నా ఆ రైతులనే వారికి అడ్డుగా పె ట్టి తమ దందాను యధావిధిగా కొనసాగిస్తున్నారు.

అధికారులకు మామూళ్ల పండుగ..

ఒక్క టిప్పర్‌ గ్రావెల్‌కు రూ 10వేలు వస్తుండగా ఆ టిప్పర్‌ రోజుకు ఐదు ట్రిప్పుల వంతున గ్రావెల్‌ తోలుతుండడంతో స్మగ్లర్లకు చేతుల నిండా కనకవర్షం కురుస్తుంది. దీంతో అధికారులకు కొంతమంది స్మగర్లు రోజువారి మామూళ్లు ముట్టజెబుతుంటే మరికొంతమంది స్మగ్లర్లు నెలవారి మామూళ్లను అధికారులకు లక్షల రూపాయలు ముట్టజెబుతున్నారు. ఈ స్మగ్లర్ల పుణ్యమా అని ఇటు రైతులు ప్రభుత్వం తమకు జీవనాధారంగా ఇచ్చిన భూములు కోల్పోతున్నా, గ్రామ పొలిమేరలంతా గోతులుగా మారుతున్నా, రాత్రి వేళల్లో రహదారుల వెంబడి టిప్పర్లు పరుగులు పెడుతున్నా అధికారులు చూస్తూ మిన్నకుండి పోతున్నారు. ముఖ్యంగా ఆనేపూడి నుంచి దొరవారిసత్రం వచ్చే ఆర్‌అండ్‌బీ రహదారి ఈ టిప్పర్ల దాటికి అక్కడక్కడా గోతుల మయంగా మారడంతో ఆ రహదారిపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిపై కేవలం 7 టన్నుల వరకు మాత్రమే వెళ్లాల్సి ఉండగా అధికలోడుతో వెళుతున్న ఈ టిప్పర్లు అతివేగంగా వస్తుండడంతో రోడ్డు భారీ గోతుల మయంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతస్థాయి అధికారులు స్పందించి ఈ గ్రావెల్‌ మాఫియాను కట్టడి చేయకుంటే మరింతమంది రైతులు వీరి బారినపడి పంటపొలాలను పోగొట్టుకునే అవకాశం ఉంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement