Sunday, April 28, 2024

YS Sharmila: రాహుల్ ను ప్ర‌ధానిగా చూడ‌ట‌మే నాన్న ఆశ‌యం… అందుకోసం కృషి చేస్తా…

హైదరాబాద్: రాహుల్ ను ప్ర‌ధానిగా చూడ‌ట‌మే నాన్న ఆశ‌య‌మ‌ని.. అందుకోసం కృషి చేస్తాన‌ని వై.ఎస్.షర్మిల అన్నారు. హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వైఎస్ షర్మిల వచ్చారు. తమ కుమారుడు రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని ఇవాళ‌ ఉదయం చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందించారు. చంద్రబాబుతో భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని స్పష్టం చేశారు. త‌న కొడుకు రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించినట్టుగా వై.ఎస్. షర్మిల చెప్పారు. తనతో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు పంచుకున్నారని వై.ఎస్.షర్మిల చెప్పారు.

క్రిస్‌మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చంద్రబాబు కుటుంబానికి కేక్ ను పంపినట్టుగా ఆమె చెప్పారు. లోకేష్ కూడా తనకు గిఫ్ట్ పంపిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబుకే కాదు, కవిత, హరీష్ రావు లాంటి వాళ్లకు కూడా తాను క్రిస్‌మస్ గిఫ్ట్ లు పంపిన విషయాన్ని షర్మిల ఈ సందర్భంగా వివరించారు. తన కొడుకు పెళ్లిని పురస్కరించుకొని అనేక మంది రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్టుగా షర్మిల చెప్పారు. ఈ క్రమంలోనే చంద్రబాబును కూడా ఆహ్వానించామన్నారు. వైఎస్ఆర్ కూడా తన పిల్లల పెళ్లిళ్లకు చంద్రబాబును ఆహ్వానించారన్నారు. ఆ సమయంలో చంద్రబాబు కూడా వచ్చి తమను ఆశీర్వదించిన విషయాన్ని షర్మిల ప్రస్తావించారు.

రాజ‌కీయం గురించి మాట్లాడుతూ.. నాకు ఏ పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్ నాయకత్వం చూసుకుంటుంద‌న్నారు… రాహుల్ ప్రధాని కావాలని రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షించారని, దానిని సాధించేందుకు త‌న వంతు కృషి చేస్తాన‌ని చెప్పారు.. రాజకీయాల్లోకి వచ్చిన ప్రారంభ రోజుల్లో వైఎస్ఆర్, తాను ఎలా ఉండేవాళ్లో చంద్రబాబు తనకు వివరించినట్టుగా షర్మిల చెప్పారు. రాజారెడ్డి పెళ్లికి వస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఏ పదవి ఇవ్వాలి, ఏ బాధ్యత ఇవ్వాలనే విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

- Advertisement -

చంద్రబాబును తాను కలవడం స్నేహపూర్వక వాతావరణంలో చూడాల్సిన అవసరం ఉందని షర్మిల చెప్పారు. రాజకీయాలు అనేది జీవితాలు కాదు, రాజకీయాలు అనేది త‌మ వృత్తి అని ఆమె తెలిపారు. రాజకీయాల్లో ఉన్నందున పరస్పరం విమర్శలు చేసుకొనే పరిస్థితులు అనివార్యంగా వస్తాయన్నారు. అలాంటి పరిస్థితులను దాటుకొనేందుకు పండుగలు, పెళ్లిళ్లకు ఆహ్వానించడం ద్వారా వ్యక్తిగతంగా సంబంధాలు మెరుగౌతాయన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడి పెట్టొద్దని
షర్మిల సూచించారు. చంద్రబాబుతో రాజకీయంగా ఎలాంటి లావాదేవీలు, ఉండవు, ఉండబోవు, ఉండకూడదని షర్మిల స్పష్టం చేశారు. పార్టీలు, నేతలు ఉన్నందున ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement