Monday, April 29, 2024

స్వయం పోషకాలుగా పురపాలకాలు.. ప్రభుత్వ టౌన్‌షిప్‌లు, ప్రైవేట్‌ బిల్డర్లకు రాయితీలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని పురపాలక సంఘాలను స్వయంపోషకాలుగా తీర్దిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరాలు.. పట్టణాల విస్తరణలో భాగంగా గ్రామాల విలీనీకరణతో పాటు గృహనిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి జగనన్న కాలనీల్లో ప్రభుత్వ ఇళ్లతో పాటు మధ్యతరగతి వర్గాలకు అందుబాటు ధరల్లో టౌన్‌షిప్‌లను అభివృద్ది చేయనుంది. దీంతో పాటు అల్పాదాయ వర్గాలకు సరసమైన ధరల్లో సొంతింటి కల నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేట్‌ బిల్డర్లకు ప్రోత్సాహకాలు.. రాయితీలు ప్రకటించింది. ప్రభుత్వ లేఅవుట్లలో స్థలాలు మార్కెట్‌ ధరను బట్టి నిర్ణయించింది. అయితే అల్పాదాయ వర్గాలు (లోయర్‌ ఇన్‌కం గ్రూప్‌) గృహ నిర్మాణాలకు సంబంధించి ఏపీ బిల్డింగ్‌ రూల్స్‌- 2017 చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. టిడ్కో ఇళ్లను 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులతో పేద వర్గాలకు అందిస్తున్న నేపథ్యంలో తక్కువ ఆదాయం ఉన్న వారికి ఒక మోస్తరు అంటే 400 నుంచి 600 చదరపు అడుగులతో ప్లాట్ల నిర్మాణానికి అనువుగా బిల్డింగ్‌ రూల్స్‌లోని వివిధ సెక్షన్లలో మార్పులు, చేర్పులు చేసింది.

ఉప నిబంధన 10(డీ)(13), 24, రూల్‌ 3లో ఉప నిబంధన 32(బీ) (8), 9, 4(హెచ్‌), సబ్‌ రూల్‌ (2)(జీ), సీ (12), అనుబంధం 6,7లో సవరణలు తెచ్చింది. దీంతో పాటు 172 నిబంధనను 172(ఏ),172 (బీ)గా వర్గీకరించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈ డబ్ల్యూఎస్‌), అల్పాదాయ వర్గాలు (ఎల్‌ఐజీ)లకు సరసమైన హౌసింగ్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. పార్కింగ్‌తో సహా బిల్డింగ్‌ ప్లాన్‌కు అవసరమైన అన్ని అనుమతులు ప్రైవేట్‌ బిల్డర్లకు మంజూరు చేస్తుంది. మొత్తం ఫీజులో 10 శాతం రాయితీతో పాటు గృహనిర్మాణ సముదాయాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుంది.. అయితే ఇందులో జిల్లా కలెక్టర్ల ప ర్యవేక్షణలో ప్లాట్ల అమ్మకపు ధరను నిర్ణయించే అంశాన్ని తొలగించి బిల్డర్లు న్యాయసమ్మతమైన ధరకు విక్రయించే వీలు కల్పించింది. అదనపు అంతస్తుల నిర్మాణానికి అవసరమైన అగ్నిమాపక అనుమతులిస్తారు. టీడీఆర్‌తో నిమిత్తం లేకుండా మినహాయింపు కూడా ఉంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా అన్ని పట్టణాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ నిర్దేశించింది. పార్కింగ్‌కు సంబంధించి నిబంధన 6(30)(సీ)లో ఊహించిన విధంగా మార్పులు చేసుకునే వీలు కల్పించింది.

- Advertisement -

ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్‌)ను కేటగిరి-1, అల్పాదాయ వర్గాలకు కేటగిరి-2 హౌసింగ్‌ స్కీములుగా గుర్తించింది. బిల్డింగ్‌ రూల్స్‌2017లో 180 నిబంధనను తొలగించింది. డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విస్తరణ, కనెక్టివిటీ సిద్ధంగా ఉండేలా నిర్మించాల్సి ఉంటుంది. నిర్ణీత ప్రమాణాలను నిర్థారించిన మేరకే భవనాలకు ఆక్యుపెన్సీ కమ్‌ కం ప్లీషన్‌ సర్టిఫికెట్‌ను అందజేస్తారు. బిల్డింగ్‌ ప్లాన్‌నుు సిద్ధం చేసుకునే సమయంలో భవనాల లోపల, వెలుపల, పైకప్పులపై బ్రాడ్‌బ్యాండ్‌, డిజిటల్‌ కనెక్టివిటీ ఇన్‌ఫ్రా కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. భవన నిర్మాణాల్లో నిర్దేశించిన నిబంధనలు ఉల్లంఘిస్తే రెండింతల పెనాల్టిd విధిస్తారు. ఇలా ఈడబ్ల్యూఎస్‌, ఎల్‌ఐజీ వర్గాలకు అందుబాటులో గృహ నిర్మాణం చేపట్టేందుకు ప్రైవేటు బిల్డర్లను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి నిర్దేశించిన జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లను పూర్తి స్థాయిలో అందించేందుకు కార్యాచరణ నిర్దేశించింది.

రాజధాని ప్రాథికార అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ), విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) పరిధిలో ఇప్పటికే టౌన్‌షిప్‌లలో ప్లాట్ల అమ్మకం జరుగుతోంది. సీఆర్‌డీఏ టౌన్‌షిప్‌లో అమ్మకపు ధరలో 60 శాతం వరకే రిజిస్ట్రేషన్‌ చార్జీలు వసూలు చేయటంతో పాటు ఏడాది పాటు వాయిదాల పద్దతిలో చెల్లింపులు జరిపేలా మధ్యతరగతి ఆదాయ వర్గాలు (ఎంఐజీ) నివేశన స్థలాలను విక్రయిస్తున్నారు. ఇక పురపాలకసంస్థలకు ఆదాయం వచ్చే మార్గాల్లో భాగంగా అర్బన్‌ రీ సర్వేతో స్థిరాస్తులను గుర్తించి అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను, ఇతర పన్నుల వసూళ్లను వేగవంతం చేసేదిశగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రధానంగా పట్టణాల్లో అధ్వాన్నంగా మారిన రోడ్ల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆక్రమణల తొలగింపుతో పాటు విస్తరణకు లైన్‌ క్లియర్‌ చేసింది. గుంటూరు,తాడేపల్లి కార్పొరేషన్ల పరిధిలో రోడ్ల విస్తరణను వేగవంతం చేసింది. దీంతో రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయనే ప్రతిపక్షాల ఆరోపణలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement