Saturday, July 27, 2024

అంగన్‌వాడీలకు నవశకం.. రాష్ట్రంలో 3500 కేంద్రాలకు కొత్త భవనాలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అంగన్‌వాడీ వ్యవస్థకు జీవం పోస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలను పూర్తిగా మార్చేయాలన్న సంకల్పంతో కీలకమైన అడుగులు వేస్తోంది. అంగన్‌వాడీలను ఫౌండేషన్‌ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం ఇప్పుడు సొంత భవనాల నిర్మాణంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించేందుకు సమగ్ర కార్యాచరణను రూపొందించి పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 23 వేల 510 అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటన్నింటినీ దశలవారీగా సొంత భవనాల్లో మార్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నాడు – నేడు ఫేజ్‌ 2 కింద తొలిదశలో రాష్ట్రంలోని 3500 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ. 16 లక్షలు కేటాయిస్తూ ఆదేశాలిచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం అన్ని హంగులతో నిర్మించే విధంగా కార్యాచరణను రూపొందించింది. కొత్త కేంద్రాల్లో వంట గది, టాయిలెట్స్‌తో పాటు సువిశాలమైన ఆటస్థలం ఉండేలా ప్రణాళికను సిద్ధం చేసింది. ఒక్కొక్క కేంద్రం కనీసం 814 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా ఆదేశాలిచ్చింది.

అంగన్‌వాడీల కొత్త భవనాల నిర్మాణాన్ని ప్రాధాన్యతాక్రమంలో నిర్మించేందుకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం ఈ నిర్మాణ బాధ్యతలను గృహ నిర్మాణ శాఖకు అప్పగించింది. మరోవైపు నిర్మాణ పర్యవేక్షణా బాధ్యతలను ఐసీడీఎస్‌, సమగ్ర శిక్షా అభియాన్‌ శాఖలకు కూడా వర్తింపజేసేలా ఆదేశాలు ఇచ్చింది. మొత్తం 3500 కేంద్రాల నిర్మాణానికి రూ. 560 కోట్లు ఖర్చు అవుతాయన్న అంచనాలను అధికార యంత్రాంగం వేసింది. అధికారుల అంచనాలు, ప్రతిపాదనలకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో కొత్త భవనాల నిర్మాణ పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. రాష్ట్రంలో 257 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 55 వేల 607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 22 వేల కేంద్రాలు సొంత భవనాల్లో పనిచేస్తున్నాయి. అలాగే మరో 10 వేల 600కు పైగా కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల భవనాల్లో నడుస్తున్నాయి. మిగిలినవన్నీ కూడా అద్దె భవనాల్లోనే ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సొంత భవనాల్లోనే అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుని దాదాపు పూర్తి చేసింది. నాడు – నేడు తొలిదశలో 960 అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరించింది. ఒక్కొక్క కేంద్రానికి రూ. 2 లక్షల వ్యయాన్ని చేసి వాటి స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది.

ఈ క్రమంలోనే నాడు – నేడు ఫేజ్‌ 2 కింద అంగన్‌వాడీలకు సొంత భవనాలను నిర్మించే ప్రక్రియకు అంకురార్పణ చేసింది. మొత్తం మూడు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అద్దె అంగన్‌వాడీ కేంద్రాలను సొంత భవనాల్లోకి మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. నాడు – నేడు ఫేజ్‌ 2 కింద నిర్మించనున్న ఈ కొత్త భవనాల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. గృహ నిర్మాణ శాఖ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ పూర్తికానుంది. విడతల వారీగా నిర్మాణాలు చేపట్టే ప్రక్రియ జరిగే క్రమంలోనే ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆధునీకరణ ఇంకా పూర్తికాని కేంద్రాలకు అదనంగా రూ. 2 లక్షలు కేటాయించి మౌలిక సదుపాయాలతో పాటు చిన్నారులకు ఆడుకునేందుకు క్రీడా పరికరాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2024 జూన్‌ నాటికల్లా అద్దె అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తిగా సొంత భవనాల్లోకి మార్చాలన్న ధృడ నిశ్చయంలో ప్రభుత్వం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement