Monday, April 29, 2024

ఎన్‌హెచ్‌ఆర్‌సీకి రఘురామ ఫిర్యాదు

ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ పిసి.పంత్‌ను నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కలిశారు. సీఐడీ పోలీసులు విచారణలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదు చేశారు. సీఐడీ పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఎంపీ కుమారుడు భరత్ కూడా ఫిర్యాదు చేశారు. భరత్ ఫిర్యాదుపై ఇప్పటికే అంతర్గత విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, సీఐడీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు కూడా జారీ చేసింది. సీఐడీ అధికారుల తీరును స్వయంగా కలిసి ఎంపీ రఘురామ వివరించారు. మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తామని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ హామీ ఇచ్చారు.

రఘురామ నిన్న ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై ఫిర్యాదు చేయడం తెలిసిందే. తనను ఆసుపత్రి నుంచి త్వరగా డిశ్చార్జి చేసేలా వైద్యులను కేపీ రెడ్డి ఒత్తిడి చేశారని రఘురామ ఆరోపించారు. రఘురామ వీల్ చెయిర్ లోనే రాజ్ నాథ్ సింగ్ నివాసానికి వెళ్లారు. రాజ్ నాథ్ తో కొద్దిసేపు సమావేశమయ్యారు. సీఐడీ కేసు నుంచి ఎయిమ్స్ లో చికిత్స వరకు ఇటీవల జరిగిన పరిణామాలను కేంద్రమంత్రికి క్లుప్తంగా వివరించారు.

కాగా, సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రఘురామ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చిక్సిత పొందిన సంగతి తెలిసిందే. రాజద్రోహం కేసులో అరెస్టయిన రఘురామను కస్టడీలో ఏపీ పోలీసులు వేధించారన్న ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. పోలీసులు కొట్టడం వల్ల తగిలిన దెబ్బలు అంటూ రఘురామ ఆరోపించారు. ఈ వ్యవహారం సీఐడీ కోర్టు పరిధిని దాటి హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. సుప్రీంకోర్టు బెయిల్ ఆదేశాలు ఇవ్వడంతో విడుదలైన ఆయన, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఆయన రెండు కాళ్లకు కట్లు కట్టిన ఎయిమ్స్ వైద్యులు, కొన్నిరోజుల పాటు నడవరాదని సూచించారు.

ఇది కూడా చదవండి : వైసీపీ రెండేళ్ల పాలనపై పుస్తకం.. ప్రజలకు ప్రగతి నివేదిక..

Advertisement

తాజా వార్తలు

Advertisement