Monday, April 29, 2024

Sand Policy – జ‌గ‌న్ దోపిడి కోస‌మే ఇసుక విధానం… ఈడితో విచార‌ణ‌కు ఎంపి బాల‌శౌరి డిమాండ్ …

గుంటూరు: జగన్‌ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని జనసేన నేత, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ”ఏపీలో ఇసుక విధానం జగన్‌ దోపిడీ కోసమే అన్నట్టుగా ఉంది. తరచుగా ఇసుక పాలసీని మార్చి, కృత్రిమ కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా చేశారు. జేపీ సంస్థతో పాటు మరికొన్ని సంస్థలు సబ్‌ కాంట్రాక్టులు తీసుకున్నాయి. కొన్ని జిల్లాల్లో వైకాపా నాయకుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయి. బంగారం ధర తగ్గుతుందేమో కానీ, ఇసుక ధర మాత్రం తగ్గడం లేదు. పర్యావరణ అనుమతులు లేకుండానే తవ్వకాలు జరగుతున్నాయి. పేదలకు పెత్తందారులకు పోరాటం అని చెప్పే జగన్.. రీచ్‌లపై ఆధారపడిన పేదల ఆదాయానికి గండి కొట్టారు. కార్పొరేట్‌ సంస్థ ద్వారా రూ.వందల కోట్లు జేబుల్లో వేసుకుంటున్నారు.

రాష్ట్రంలో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. తమిళనాడులో అక్రమ తవ్వకాలపై ఈడీ తనిఖీలు చేసి ఐదుగురు కలెక్టర్లపై కేసులు పెట్టింది. అత్యాధునిక సాంకేతికత వినియోగించి అక్కడ తనిఖీలు నిర్వహించారు. మన వద్ద ఎంత తవ్వినా, ఎలా తవ్వినా ఏం కాదన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. భవిష్యత్తులో మన రాష్ట్రంలో కనీసం పది మంది కలెక్టర్లు ఇబ్బంది పడతారు. తమిళనాడు తరహాలో ఏపీలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేయాలి. నా ఎస్సీ, నా బీసీ అనే జగన్‌.. ఇసుక ఆదాయంలో వారికి వాటా ఎందుకు ఇవ్వడం లేదు? ఇసుక స్కామ్‌ చాలా పెద్ద కుంభకోణం. ఈడీ తనిఖీలు చేస్తే సూత్రధారులు ఎవరో బయటకు వస్తారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు” అని బాలశౌరి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement