Saturday, May 4, 2024

Chittoor : జగన్ హామీ మేరకే చిత్తూరు డెయిరీకి మోక్షం : మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకే మూతపడిన చిత్తూరు పాల డెయిరీ పునరుద్దరణ చర్యలకు ఈనెల 4న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని రాష్ట్ర విద్యుత్, అటవీ, గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించడానికి ఈరోజు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ… తన సొంత డెయిరీ హెరిటేజ్ కోసం చంద్రబాబు ప్రభుత్వం చిత్తూరు డెయిరీని మూత పడేలా చేసిన తీరును గురించి చెప్పినప్పుడు పాదయాత్రకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి పునరుద్దరణకు హామీ ఇచ్చారని గుర్తు చేసారు. ఆ హామీ మేరకే జిల్లాలోని పాడి రైతుల సంక్షేమం కోసమే చిత్తూరు పాల డెయిరీని ప్రముఖ అమూల్ డెయిరీకి లీజు కు ఇస్తున్నట్టు తెలిపారు. లీటర్ రూ. 5 ఉన్న పాల సేకరణ ధర రూ.20కి పెరుగుతుందని, ప్రైవేటు డెయిరీలు కూడా అంతే ధర చెల్లించాల్సి వస్తుందన్నారు. ఫలితంగా పాడి రైతుకు లాభం కలుగుతుందన్నారు.

మరోవైపు చిత్తూరు డెయిరీ తరపున చెల్లించాల్సిన బకాయిల కింద రూ.32 కోట్లను ప్రభుత్వం ఈ రోజే విడుదల చేసిందని చెబుతూ, వెంటనే చెల్లింపులు మొదలవుతాయని చెప్పారు. ఇక భవిష్యత్ లో ఒకప్పటి లాగే చిత్తూరు డెయిరీ త్వరలో జిల్లాలోని పాడి రైతులకు వరప్రసాదిని అవుతుందన్నారు. చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఈ ప్రాంతంలో రైతులు చెరకు పంట వేయకపోవడం వల్ల ఆ ఫ్యాక్టరీని తిరిగి తెరవడం కన్నా రైతుల కోసం ఫుడ్ ప్రొసీసింగ్ యూనిట్ లను అందులో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అయితే చిత్తూరు ఫ్యాక్టరీ సిబ్బందికి రావాల్సిన బకాయిల మొత్తం రూ.11కోట్లు త్వరలో విడుదల చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఈనెల 4వ తేది పర్యటనలో వెల్లూరు సీఎంసీ వారు చిత్తూరులో నిర్మించ తలపెట్టిన 300పడకల హాస్పిటల్ కు శంకుస్థాపన చేస్తారని కూడా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, చిత్తూరు లోకసభ సభ్యుడు రెడ్డెప్ప, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ షన్మోహన్, చిత్తూరు శాసనసభ్యుడు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement