Saturday, May 18, 2024

కాంగ్రెస్ తోనే సంక్షేమం, అభివృద్ధి .. పీసీసీ అధ్య‌క్షుడు గిడుగు రుద్రరాజు…

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో – మైనారిటీలు, బడగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. ఉమ్మడి కర్నూలు, క్రిష్ణా జిల్లాలకు చెందిన పలువురు మైనారిటీ నేతలు బుధవారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించిన రుద్రరాజు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అందరికీ సంక్షేమ, అభివ్రుద్ధి ఫలాలు సమానంగా అందుతాయని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు అధికారం సాధించే దిశగా అందరం కలిసి సమిష్టిగా పని చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను ఆదర్శంగా తీసుకుని తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కర్నూలు నగర వైసీపీ మైనారిటీ మాజీ అధ్యక్షులు షేక్ మాలిక్ బాష పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన అందిస్తాడని నమ్మి జగన్ చేతిలో మోసపోయామని తెలిపిన ఆయన, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివ్రుద్ధి చెందుతుందని తెలిపారు. వైసీపీ, టీడీపీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులని విమర్శించారు.

మాలిక్ బాషాతో పాటు కర్నూలు నగరానికి చెందిన వైసీపీ మైనారిటీ నాయకులు సయ్యద్ నవీద్, షేక్ మియా బాషా, షేక్ అన్వర్ బాషాలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా పని చేస్తామని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్.పి.ఐ) రాష్ట్ర మైనారిటీ మాజీ అధ్యక్షులు షేక్ అమీన్ భాయ్ స్పష్టం చేశారు. ఆర్.పి.ఐకు రాజీనామా చేసి, పీసీసీ అధ్యక్షడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించిన అమీన్ భాయ్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు.

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మహ్మద్ ముస్తాక్, ఉపాధ్యక్షులు అబ్దుల్ అజీమ్, ఆర్.పి.ఐ క్రిష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు అబ్ధుల్ రిహానా బేగం, మహ్మద్ మెహ్రాజ్ బేగంలు కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర అధ‌్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఏఐసీసీ సభ్యులు మేడా సురేష్, మీసాల రాజేశ్వరరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ధనేకుల మురళి, బైపూడి నాగేశ్వరరావు, మైనారిటీ నాయకులు నాగూర్, బేగ్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement