Sunday, April 28, 2024

సినిమా ఒక వస్తువు కాదు.. వినోద సేవ మాత్రమే: వర్మకు మంత్రి పేర్నినాని కౌంటర్

ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు వివాదం ముదురుతోంది. ఈ అంశంపై టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టికెట్ల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దర్శకుడు వర్మ చేసిన ట్వీట్‌ కు ఏపీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

”హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు ? మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు ? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు? ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించదు” అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. థియేటర్లలో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలన్నారు. ఇది 1970 సినిమాటో గ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెబుతున్నాయని గుర్తు చేశారు.

ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్‌ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారని… సినిమా ఒక వస్తువు కాదని, అది వినోద సేవ మాత్రమేనని చెప్పారు. ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్‌ ధరల నియంత్రణ మాత్రమే తప్ప, సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదని చెప్పారు. మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని,మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారని సెటైర్ వేశారు. సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు అని…సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ ? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.

కాగా నిన్న ఏపీ ప్రభుత్వంపై వర్మ మండిపడిన సంగతి తెలిసిందే. సినిమాలతో సహా ఏదైనా ఉత్పత్తికి మార్కెట్ ధరను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఖచ్చితంగా ఏమిటి సార్ ? అంటూ వర్మ ప్రశ్నించారు. మీ ప్రభుత్వానికి అట్టడుగు స్థాయి నుండి మద్దతు ఇచ్చే అధికారం ఇచ్చారని, మా తలపై కూర్చోవడానికి కాదని మీరు అర్థం చేసుకోవలసిందిగా కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement