Saturday, May 18, 2024

కొబ్బరి రైతుకు పెద్ద దెబ్బ.. తగ్గిన దిగుబడులు, పతనమైన ధర..

కోనసీమ, ప్రభన్యూస్‌ : కోనసీమ వ్యాప్తంగా కొబ్బరి రైతులు కుదేలౌతున్నారు. జిల్లాలోని 16మండలాల పరిధిలో కొబ్బరి సాగవుతోంది. 96వేల ఎకరాల్లో కొబ్బరి తోటలున్నాయి. ప్రత్యక్షంగా 34వేల మంది, పరోక్షంగా రెండున్నరలక్షల మంది ఈ కొబ్బరిపైనే ఆధారపడ్డారు. అలాగే కొబ్బరి ఉప ఉత్పత్తులకు సంబంధించి జిల్లా పరిధిలో ఏడు చిన్న తరహా పరిశ్రమలున్నాయి. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 8వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. కాగా ఇప్పుడు కొబ్బరి రైతుతో పాటు పరిశ్రమ కూడా కుదేలయ్యే పరిస్థితేర్పడింది. గతేడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలు కొబ్బరిపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ వర్షాల కారణంగా అప్పుడే వేస్తున్న పిందెలు రాలిపోయాయి. ఈ ప్రభావంతో ఇప్పుడు ఉత్పత్తి దిగజారింది. సాధారణంగా నెలనెలా కొబ్బరి తోటలో దింపు తీస్తారు. ఎకరా పరిధిలో నెలకు సుమారు వెయ్యి కాయలు దిగుబడుంటుంది. కాగా ఇప్పుడది గరిష్టంగా ఆరొందలు మించడంలేదు. ఇదే సమయంలో కొబ్బరి ధర పతనమైంది. మూడ మాసాల క్రితం వరకు వెయ్యి కాయల ధర 8500 నుంచి 9500వరకుండేది.

కాగా ఇప్పుడు ధర 7వేల నుంచి 7500లకు పడిపోయింది. ఇదిలా ఉంటే గతమాసం రోజులుగా కోనసీమ నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా స్థంభించింది. అమలాపురంలోజరిగిన అల్లర్ల అనంతరం కోనసీమ మొత్తం పోలీస్‌ దిగ్భంధనంలో ఉంది. కోనసీమ జిల్లాలో సెక్షన్‌ 30, 144లు విధించారు. దీంతో ఇక్కడకు లారీలొచ్చే పరిస్థితిలేదు. అలాగే ఇక్కడ్నుంచి లారీల్లో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే అవకాశం కొరవడింది. ఈలోగా దించిన కాయల్ని స్థానికంగా తప్ప ఇతర ప్రాంతాలకమ్మే పరిస్థితి రైతుకు కొరవడింది. దీంతో కొబ్బరి పేరుకుపోయింది. ఇది ధరల పతనానికి దారితీసింది. ఈ దశలో ఆషాడం మొదలైంది.

దీంతో కొబ్బరిపై పలు రకాల ప్రభావాలు పడ్డాయి. ఓ వైపు కొబ్బరి రైతుకు ఏటేటా పెట్టుబడి పెరుగుతోంది. ముఖ్యంగా కొత్త కొత్త వ్యాధులు కొబ్బరినాశిస్తున్నాయి. వీటి నివారణ కోసం ఖరీదైన పురుగుల మందుల్ని వినియోగించాల్సొస్తోంది. అలాగే కొబ్బరి దింపు కార్మికుల కొరత నెలకొంది. గతంలో దింపు కార్మికులుగా పనిచేసిన వారంతా ఇప్పుడు ఉపాధి కూలీలుగా మారిపోయారు. దింపు కూలీలకు అదనపు మొత్తాలు చెల్లించాల్సొస్తోంది. వెరశి కొబ్బరి రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఈ నెలంతా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అనంతరం వచ్చే శ్రావణమాసం, భాద్రపద మాసాల్లో వరుసగా పండుగలొస్తాయి. అలాగే దసర, దీపావళి వచ్చే వరకు ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుంది. పండుగ సమయంలో స్థానికంగా వినియోగం పెరుగుతుంది. అలాగే ఇతర ప్రాంతాల్లోనూ కోనసీమ కొబ్బరికి గిరాకీ ఏర్పడుతుంది. అప్పటివరకు కొబ్బరి రైతులు నష్టాల్ని అనుభవించక తప్పదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement