Friday, May 3, 2024

శీర్షాసనమేసిన శివుడు.. ఒకే పానవట్టంపై పార్వతీ పరమేశ్వరుడు.. ఈ ఆలయం ఎక్కడుందంటే..

సాధారణంగా శివుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అయితే కొన్ని క్షేత్రాల్లో మాత్రమే విగ్రహ రూపంలో ఉంటాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రంలో పరమశివుడు విగ్రహరూపంలోనే కాక శీర్షాసంలో ఉంటారు. ఆయన పక్కనే పార్వతీదేవి నెలల పసికందు అయిన కుమారస్వామిని తన ఒడిలో లాలిస్తూ ఉంటుంది. వీరు ముగ్గురూ ఒకే పానివట్టం మీద ఉండటం మరొక విశేషం. ఇటువంటి విలక్షణ క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా? ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావారి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఉంది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ క్షేత్రం ఉంటుంది.

ఈ గ్రామంలోని దేవాలయాన్ని శ్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం అంటారు. దీన్ని తూర్పు చాళుక్యులు నిర్మించినట్లు ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఈ క్షేత్రానికి రెండు స్థలపురాణాలు ఉన్నాయి. మొదటిది యముడు తన కర్తవ్య నిర్వహణ విషయంలో విరక్తి చెంది తనకు మోక్షం ప్రసాధించాల్సిందిగా శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యి నీ పేరుమీద ఒక గ్రామం అందులో ఒక శివాలయం వెలుస్తుందని, అప్పడు నీపై ఉన్న అపప్రద తొలిగి నిన్ను కూడా దేవతల మాదిరి జీవులు గుర్తిస్తారని అభయమిస్తాడు.

అదే యమనదుర్రు గ్రామం. అందులో వెలిసిన దేవాలయమే శ్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే దీర్ఘరోగాలకు ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. రెండో కథనం ప్రకారం శంబిరుడనే రాక్షసరాజు ప్రజలను తీవ్ర హింసలకు గురిచేస్తుంటాడు. దీంతో మునులు యమధర్మరాజు వద్దకు వెళ్లి తమ బాధలు చెప్పుకుంటారు. చిత్రగుప్తుడి ద్వారా శంబిరుడి ఆయువును యముడి లెక్కగడుతాడు. శంబిరుడి ఆయువు త్వరలో తీరుపోతుందని దీంతో అతి త్వరలో ఆ రాక్షసుడిని సంహరిస్తారని యముడు వారికి చెబుతాడు. అయితే శంబిరుడు ఈశ్వరుడి పరమ భక్తుడు. గతంలో ఈశ్వర ఆజ్జ ప్రకారం ఈశ్వరుడి భక్తులను సంహరించాలంటే ముందుగా ఈశ్వరుడి అనుమతి తీసుకోవాలి. దీనిని జ్జప్తికి తెచ్చుకున్న యముడు యమనదుర్రులో ఘోర తప్పస్సు చేసి ఉన్నఫళంగా ప్రత్యక్షం కావాలని లేదంటే లోక వినాశనం తప్పదని యోగమాయ ద్వారా శివుడికి చేరవేస్తాడు.

ఆ సమయంలో శివుడు శీర్షాసనంలో తపస్సు చేస్తుంటాడు. ఆయన పక్కనే పార్వతీ దేవి కుమారస్వామిని ఒడిలో లాలిస్తుంటుంది. దీంతో పార్వతికి విషయం చెప్పి పరమశివుడు అదే స్థితిలో యముడికి ప్రత్యక్షమవుతాడు. అందువల్లే ఇక్కడ శివుడు శీర్షాసన స్థితిలో కనిపిస్తాడని శివపురాణం చెబుతోంది. శంబిరుడిని సంహరించడనికి పరమశివుడు యముడికి అనుమతి ఇవ్వడమే కాకుండా ఇకపై తాము ఇదే స్థితిలో భక్తులకు దర్శనమిస్తామని శివుడు తెలిపాడు. అదే విధంగా ఇక్కడ ఒకే పీఠంపై పార్వతి, పరమేశ్వరులు, కుమారస్వామి కొలువై ఉంటారు. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే దీర్ఘ రోగాలు నయమవుతాయని కూడా ఇక్కడి పూజారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement