Friday, May 17, 2024

AP | రాష్ట్రంలో వర్షాభావం.. ఈ ఏడాది సగటు కంటే తగ్గనున్న వర్షపాతం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఆ ప్రభావం వర్షపాతంపై పడింది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 25 శాతం వాన లోటు కనిపిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో సాధారణం కంటే తక్కవ వర్షపాతం నమోదవ్వగా, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నంధ్యాల, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవ్వగా పొట్టి శ్రీరామలు నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

- Advertisement -

మందకోడిగా వర్షాలు..

సాధారణంగా నైరుతి రుతుపవనాలు మే నెలాఖరు నుంచి జూన్‌ మొదటి వారం లోపు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. గతేడాది మే 29న రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించగా ఈ ఏడాది జూన్‌ 11న ప్రవేశించింది. రాయలసీమలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు సాధారణంగా నాలుగైదు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించాల్సి ఉండగా రాయలసీమ ప్రాంతంలోనే వారం రోజులపాటు నిల్చిపోయాయి. ఆ తరువాత ఐదు రోజులకు కానీ రాష్ట్రమంతటా విస్తరించలేదు. ఈక్రమంలో వర్షాలు మందకోడిగా పడుతున్నాయి.

ఈ ఏడాది సగటు వర్షపాతం కంటే దేశంలో 4 శాతం లోటు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలో కూడా వర్షపాతం తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా కడుతున్నారు. రాష్ట్రంలో సగటు- వర్షపాతం 574.8 మి.మీ. ఉండాలి . 2022లో సిజన్లో 583.2 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షపాతం తగ్గుదల ప్రభావంతో గతంతో పోలిస్తే రాష్ట్రంలో వరదలు ప్రభావం కూడ తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.

వానలోటు.. రైతుపాటు

వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రైతాంగం వాపోతోంది. ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 86 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయన్నది వ్యవసాయశాఖ అంచనా. అయితే ఇప్పటి వరకు ఐదు లక్షల ఎకరాల్లో సాగు మొదలవ్వాల్సి ఉండగా రెండున్నర లక్షల ఎకరాల్లో మాత్రమే వరి, వేరుశనగ, పత్తి వంటి పంటల సాగు మొదలైనట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఖరీఫ్‌ సీజన్‌ ఇరవై రోజులు వెనకబడ్డట్లైంది. విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప ఖరీఫ్‌ సాగు ఊపందుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. వర్షం కోసం రైతన్న ఆశగా ఆకాశం కేసి ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement