Sunday, April 28, 2024

AP: కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు… నంద్యాల అభ్యర్థిగా బైరెడ్డి శబరి…

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. 11 అసెంబ్లీ, 13 లోక్ సభ స్థానాలకు తాజాగా అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటివరకు 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి పంచలింగాల నాగరాజు, నంద్యాల పార్లమెంటు అభ్యర్థిగా బైరెడ్డి శబరిలను ప్రకటించారు. కాగా కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆదోని సెగ్మెంట్ స్థానాల అభ్యర్థులను టీడీపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఆదోని స్థానంలో బీజేపీకి కేటాయించినట్లు సమాచారం.. అయితే ఇక్కడి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అభ్యర్థన మేరకు ఆ స్థానంపై టీడీపీ పున పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.

కురువ సామాజిక వర్గంకు కర్నూలు ఎంపీ స్థానం..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నూలు ఎంపీ స్థానంను అటు టీడీపీ ఇటు వైసీపీ బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేశాయి. అధికార పార్టీ వైసీపీ బీసీ సామాజికవర్గంలోని వాల్మీకి వర్గంకు చెందిన మేయర్ బీవై.రామయ్య కు కర్నూల్ పార్లమెంట్ స్థానంను కేటాయించగా, అయితే ఈసారి టీడీపీ వినూత్నంగా కురువ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల నాగరాజుకు పార్టీ టికెట్ కేటాయించడం విశేషం. అయితే 2014, 2019 గత రెండు ఎన్నికల్లో టీడీపీ వాల్మీకి సామాజికవర్గంకు చెందిన బీటీ నాయుడుకు టికెట్ ఇవ్వగా ఆయన రెండుసార్లు ఓటమి చెందారు. అయితే ఈసారి అధికార పార్టీ వైసీపీ వాల్మీకులకు కేటాయించడం గమనార్హం.

- Advertisement -

ఇక టీడీపీ కురువ సామాజిక వర్గంకి ఇవ్వడం విశేషం. ప్రస్తుతం కర్నూలు పార్లమెంటు పరిధిలో దాదాపు 5 లక్షలకు పైగా వాల్మీకి ఓటర్లు ఉండగా, రెండు లక్షలకు పైగా ఓటర్లు కురువ, యాదవ సామాజిక వర్గంకు చెందిన ఓటర్లు ఉన్నారు. ఈ రెండు వర్గాలు బలంగా ఉండడంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం విశేషం. మొత్తంగా కర్నూలు పార్లమెంటు స్థానంలో గత ఎన్నికలకు భిన్నంగా కొత్త వ్యక్తులకు పార్టీ టికెట్ ఇవ్వడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో కర్నూలు పార్లమెంటు స్థానం అంటే కోట్ల, కేయూ వర్గాలకే ప్రాధాన్యత ఉండేది.. అయితే ఈసారి అందుకు భిన్నంగా కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చారు. మరి వీరిని ఓటర్లు ఏ మేరకు ఆదరిస్తారో.. ఎవరిని ఆదరిస్తారు.. వాల్మీకి సామాజిక వర్గం పంతం నెగ్గుతుందా… కురువ సామాజిక వర్గం సత్తా చాటుతుందా అన్నది.. ఇక్కడ బేతాళ ప్రశ్నగా మిగిలింది.. ఈ రెండు సామాజిక వర్గాలలో ఏ వర్గమునకు ఓటర్లు పట్టం కడతారో.. ఎన్నికల పోలింగ్ వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement