Friday, May 3, 2024

అలుపెరుగని రాజకీయ‌ యోధుడు బి వై రామ‌య్య‌…

కర్నూల్ బ్యూరో – కష్టే ఫలి అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి, అంచెలంచెలుగా రాజకీయ పరమపద సోపానపదంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యావంతుడు, మృదుస్వభావి, అజాతశత్రువు అయిన బి.వై. రామయ్య. 1966 జూన్ 1న బి. పుట్టలయ్య, ఎల్లమ్మ దంపతులకు నాల్గవ సంతానంగా ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో జన్మించారు. వ్యవసాయ ఆధారిత కుటుంభంలో జన్మించిన బి.వై. రామయ్య తన ప్రాథమిక విద్యాభ్యాసం గడివేముల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశారు. 1982వ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న ఆయన ఇంటర్మీడియట్ అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బి.ఈ.(సివిల్) డిగ్రీ పూర్తి చేశారు. ఆపై 2002-2005 లో శ్రీ క్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీ నుంచి ఎల్.ఎల్.బి., 2006-2008లో నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.ఎం. పూర్తి చేశారు. ఇంటర్ మీడియట్ స్థాయి నుంచే క్రీడల్లో చురుకుగా ఉండే బి.వై. రామయ్య విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకున్నారు. 1994 నుంచి రాజకీయాల పట్ల ఆకర్షితులై యూత్ కాంగ్రెస్లో చురుకుగా పని చేయడమే కాకుండా ట్రెజరర్ గా కూడా బాధ్యతలు చేపట్టారు. తదనంతరం 2000వ సంవత్సరం నుంచి ప్రత్యక్షంగా క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన బి.వై. రామయ్య 2001 – 2006వ సంవత్సరంలో గడివేముల జడ్పిటిసి గా కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. అంతే కాకుండా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా అత్యంత కీలకమైన బాధ్యతలను చేపట్టి అందరి మన్ననలు పొందారు. 2011-2016వ సంవత్సరం వరకు కర్నూలు డిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బి.వై. రామయ్య 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో 2016ఆగస్టు 15వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బి.వై. రామయ్య, కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో కర్నూల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 19వ వార్డు అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుపొంది పార్టీ అధిష్టానం నిర్ణయంతో కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా రేపు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయనతోపాటు మిగిలిన 42 మంది కార్పొరేటర్లు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తంగా దశాబ్ద కాలం తర్వాత కర్నూలు కార్పొరేషన్ పాలకవర్గం కొలువు తీరం ఉండటం గమనార్హం.పాలక వర్గ ప్రమాణస్వీకారం నిమిత్తం ఇక్కడికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement