Friday, April 26, 2024

కోవిడ్ వాక్సిన్ తీసుకున్న మంత్రి పేర్ని నాని దంపతులు

మచిలీపట్నం – రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) కోవిడ్ వాక్సిన్ ను మంగళ వారం తీసుకున్నారు. మచిలీపట్నం ప్రభుత్వఆసుపత్రిలో ఆయన సతీసమేతంగా వాక్సిన్ ను తీసుకున్నారు. ఏ.ఎన్.ఎం శ్యామసుందరి మంత్రికి వాక్సిన్ ను వేసారు. ఆయన కోవీషీల్డు వాక్సిన్ ను తీసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, వ్యాక్సిన్ ఎంతో సురక్షితం అన్నారు. టీకా వేసుకున్నా.. ఎలాంటి దుష్ప్రభావం లేదు.. అపోహలు వద్దు.. నేను నా శ్రీమతితో కలిసి టీకా వేసుకున్నాను. టీకా వేసుకోవడానికి 5 నిమిషాలు కూడా పట్టలేదు. టీకా వేసుకున్న తర్వాత వైద్యుల పర్యవేక్షణలో కొద్ది సేపు ఉంటే సరిపోతుందన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేలా టీకా అభివృద్ధి చేసిన మన శాస్త్రవేత్తల కృషి అమోఘమని మంత్రి పేర్కొన్నారు. జనవరి 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. కరోనా రహిత సమాజంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
అనంతరం మంత్రి పేర్ని నాని 23 వ డివిజన్ పరిధిలోని ( ఉల్లింగిపాలెం ) కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ కు వెళ్లారు. 45 సంవత్సరాలు నిండిన పలువురు వ్యక్తులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వారికి పుష్పగుచ్చం శాలువాలు కప్పి వాక్సిన్ తీసుకున్నందుకు అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత , బందరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి, నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్ తంటిపూడి కవిత, మునిసిపల్ కమీషనర్ శివరామకృష్ణ, తహసీల్దార్ సునీల్, మాజీ మునిసిపల్ ఛైర్మెన్ సలార్ దాదా, పార్టీ అధికార ప్రతినిధి మాదివాడ రాము, తాళ్ళగంటి రమేష్ బాబు, ఏ ఎన్ ఎం కె. మరియమ్మ.సువర్ణ , రమణ , విజయలత , కొండేటి మేరీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement