Monday, April 29, 2024

మోడల్ కాలనీగా జర్నలిస్ట్స్ కాలనీ – సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ – హైదరాబాద్ జర్నలిస్ట్స్ కాలనీ తరహాలో నార్ల వెంకటేశ్వర రావు జర్నలిస్ట్స్ కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని కాలనీ .అధ్యక్షుడు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. కాలనీలో మౌళిక సదుపాయాల కల్పనకు నగరపాలక సంస్థతో పాటు ప్రభుత్వ పరంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. పాయకాపురంలోని నార్ల వెంకటేశ్వర రావు జర్నలిస్ట్స్ కాలనీ పేరిట ఏర్పాటు చేసిన నేమ్ బోర్డు లను శనివారం ఉదయం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విష్ణు మాట్లాడుతూ తాను వుడా చైర్మన్ గా ఉన్నపుడే జర్నలిస్ట్స్ కాలనీలో తాగునీరు, వీధి దీపాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇటీవల రూ.40 లక్షలతో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశానన్నారు. రానున్న వర్షాకాలం నాటికి మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. సెంట్రల్ నియోజకవర్గంలో శరవేగంగా కాలనీలు అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు. కాలనీ వాసులు అభివృద్ధి సంఘాలు ఏర్పాటు చేసుకొని సమస్యలు తన దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరించనున్నట్లు స్పష్టం చేశారు. కాలనీ గౌ.సలహాదారు, ఐజేయు ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ విష్ణు నేతృత్వంలో కాలనీ అభివృద్ధి వేగవంతం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యు.వి.సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, కార్పొరేటర్లు యర్రగొర్ల తిరుపతమ్మ, మోదుగుల తిరుపతమ్మ, కాలనీ ప్రధాన కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు రఘునాథ్, సీహెచ్ నారాయణరావు, జయరాం శ్రీధర్, కోశాధికారి సూర్యనారాయణ, జయప్రకాష్ బాబు, కృష్ణారావు, ఉండి శ్రీనివాస్, సెల్వరాజ్, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement