Thursday, May 16, 2024

సిజెఐ గా జ‌స్టిస్ ర‌మ‌ణ బాధ్య‌త‌లు … స్వ‌గ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు

కృష్ణా జిల్లా బ్యూరో – మునుపెన్నడూ లేనివిధంగా న్యాయవ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో తెలుగు తేజం జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ శనివారం 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ ప్రమాణ స్వీకార సమయంలో ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం తో ఆనందోత్సాహాలను ప్రజలందరూ పంచుకున్నారు.

గ్రామీణ నేపథ్యం…
గ్రామీణ నేపథ్యం, రైతు జీవన భూమిక నుంచి వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణ చూసి ఇప్పుడు తెలుగువారందరి గుండెలు సగర్వంగా ఉప్పొంగిపోతున్నాయి. కళ్ళనిండా విజయగర్వం తొణికిసలాడుతోంది. భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానంలో మన తెలుగుతేజం వెలుగులీనబోతోందని అంతా ఆత్మీయంగా ఎదురు చూస్తున్నారు. నేలనే నమ్ముకుని లోకానికి కమ్మగా అన్నం పెట్టే రైతు కుటుంబంలో పుట్టిన ఒక విద్యార్థి, చదువుకోవడానికి అంతగా సౌకర్యాలు లేని ప్రాంతం నుంచి తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి అతికొద్ది మంది అధిరోహించే అత్యుత్తమ స్థానాన్ని సాధించి చూపించడం కష్టసాధ్యమే కాదు, అనితరసాధ్యం కూడా. అవకాశాలు రాలేదని కూర్చోవడం కాదు. అవకాశాలు వచ్చేదాకా శ్రమించడం, అందుకు సర్వశక్తుల్నీ ఒడ్డి శ్రమించడం ఒక్కటే తెలిసిన వ్యక్తి జస్టిస్ రమణ.

వ్యవసాయ కుటుంబం నుంచి..
కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలోని ఓ వ్యవసాయ కుటుంబంలో జస్టిస్‌ ఎన్వీ రమణ 1957 ఆగస్టు 27న జన్మించారు. ఎన్‌. గణపతిరావు, సరోజినిలు ఆయన తల్లిదండ్రులు. జస్టిస్‌ రమణ కంచికచర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసి, అమరావతిలోని ఆర్‌.వి.వి.ఎన్‌ కళాశాలలో బీఎస్సీలో పట్టా పొందారు. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదై, న్యాయవాద వృత్తి ప్రారంభించారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ అయ్యారు. అనంతరం 2000లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. 55 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్ఠించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్‌ ఎన్.వి. రమణ కీర్తికెక్కారు. గతంలో రాజమహేంద్రవరానికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు భారత 9వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. భారత 48వ సీజేఐగా జస్టిస్ ఎన్.వి. రమణను నియమిస్తూ ఈనెల 6న ఉత్తర్వులు జారీచేసింది. శుక్రవారం ఆయన సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. 2022 ఆగస్టు 26 వరకు జస్టిస్‌ ఎన్‌.వి రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగుతారు.

ఉపన్యాసాల కంటే ఆచరణకే ప్రాధాన్యత
ఉపన్యాసాల కంటే ఆచరణకే జస్టిస్ రమణ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మాట్లాడితేనే భాష వినబడుతుంది. దేని గురించైనా అనర్గళంగా లోతుగా నిశితంగా మాట్లాడాలంటే నిఖార్సయిన పరిశోధన అవసరం. తెలుగు భాష గురించి సాహిత్యం గురించి ఆయన అనర్గళంగా మాట్లాడుతుంటే ఈయనకి ఇంతటి భాషాసాహిత్యజ్ఞానం ఎక్కణ్ణుంచి వచ్చిందా అని అందరూ అనుకునేవారు. సాహిత్యం గురించి, భాష గురించి చెప్పేటప్పుడు ఆయన మాటల్లో ఎంతో తపన కనిపించేది. ఆ తపనే తెలుగుభాషా వ్యవహారానికి ముఖ్యంగా న్యాయస్థానాలలో తెలుగు భాషావ్యాప్తికి కృషి చేసినవారిలో ఆయన ప్రముఖులు.

భుజస్కంధాలపై బరువైన బాధ్యతలు
ఊహించని వేగంతో కరోనా విస్తరిస్తున్న కారణంగా ఓవైపు కోర్టులు భౌతికంగా నడవని స్థితి.. మరోవైపు జిల్లాస్థాయి నుంచి ఉన్నత న్యాయస్థానాల వరకు భారీగా పెండింగ్‌ కేసులు పెరిగిపోయిన పరిస్థితుల మధ్య ఆయన బరువైన బాధ్యతలను భుజస్కంధాలపై ఎత్తుకుంటున్నారు. ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేయడమే న్యాయానికున్న అర్థమని భావిస్తుంటారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలుచేసేవారు మంచివారు కాకపోతే అది చెడుగా మిగిలిపోతుందన్న అంబేడ్కర్ సిద్ధాంతాలను విశ్వసిస్తారు. నూతన సాధనాలను అందిపుచ్చుకుని సరికొత్త విధానాలు, నవకల్పనలు, నూతన వ్యూహాలను అనుసరిస్తూ.. రాజ్యాంగ పరిధిలో న్యాయబద్ధమైన నిర్ణయాలు, తగిన ఉపశమనాలు కల్పించే.. సరికొత్త న్యాయ వ్యవస్థకు రూపకల్పన చేయాలనేదే జస్టిస్ రమణ ఆలోచన. గొప్ప న్యాయమూర్తులుగా ఎవరూ గుర్తించకపోయినా పర్లేదుకానీ రాజ్యాంగ ధర్మం తప్పకూడదనే ఆయన.. రాజ్యాంగ పరిధిలో న్యాయబద్ధమైన నిర్ణయాలు, తగిన ఉపశమనాలు కల్పించే సరికొత్త న్యాయ వ్యవస్థకు రూపకల్పన చేయాలంటారు.

- Advertisement -

న్యాయం అంటే…
న్యాయం అనేది ఒక పదంలా కనిపించినా.. భారత రాజ్యాంగంలో దానికి విస్తృతార్థం ఉందని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ చెబుతుంటారు. న్యాయం అంటే.. ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేయడమేనని ఆయన అభిప్రాయం. మంచి పనితీరు కనబరచడం, కేసుల పరిష్కారానికి గడువులు నిర్ణయించడం, సకాలంలో న్యాయమైన తీర్పులు వెలువరించడం, సాంకేతికత సాయంతో శీఘ్ర న్యాయపాలన సాధించడం సమర్థ న్యాయ నిర్వహణకు గీటురాళ్లుగా.. జస్టిస్‌ ఎన్‌.వి. రమణ చెబుతారు. వీటిని పాటించగల న్యాయమూర్తులను.. సుశిక్షితులైన కేసు మేనేజర్లను కోర్టు నిర్వాహకులుగా నియమించాలని ఆయన సూచించారు. అన్ని రాష్ట్రాలలో, కేంద్రంలో కింది నుంచి పైస్థాయి వరకు ఈ ప్రమాణాలను పాటించినప్పుడు న్యాయ ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని ఆయన భావన. కేసుల విచారణలో అనవసర ఆలస్యాన్ని నివారించాలంటే విచారణ ప్రక్రియలోని వివిధ అంచెలను నిర్దిష్ట కాలావధుల లోపల పూర్తిచేయాలని ఆదేశించే అధికారం.. న్యాయమూర్తులకు ఉండాలంటారు.
అవసరమే ఆవిష్కరణలకు ఆలంబన అని నమ్మే జస్టిస్‌ రమణ.. కొవిడ్ సమయంలో ఈ- లోక్ అదాలత్‌ను తీసుకువచ్చారు. ఈ- వివాద పరిష్కార విధానం.. ద్వారా కక్షిదారులకు ఖర్చుతో పాటు సమయం ఆదా అవుతుండగా.. న్యాయవ్యవస్థలపై పెరిగిపోతున్న పని భారాన్ని ఈ-లోక్ అదాలత్‌లు తగ్గిస్తాయని జస్టిస్‌ రమణ నమ్మకం. సంచలన తీర్పులు, ప్రచార ఆర్భాటాల కోసం న్యాయమూర్తులు వృత్తిధర్మాన్ని బలి చేయకూడదని.. జస్టిస్‌ రమణ సూచిస్తుంటారు. జడ్జిలను గొప్ప న్యాయమూర్తులుగా ఎవరూ గుర్తించకపోయినా ఫర్వాలేదు కానీ.. రాజ్యాంగ ధర్మం తప్పుదోవ పట్టకూడదనేదే ఆయన సిద్ధాంతం. రాజ్యాంగం మీద.. ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జడ్జిగా తన సొంతభావాలను కేసులపై రుద్దకూడదని, రాగద్వేషాలకు అతీతంగా, రాజ్యాంగ ఆకాంక్షలు, నిబంధనలకు లోబడి మాత్రమే.. తీర్పులు ఇవ్వాలని న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టేవారికి జస్టిస్‌ రమణ సూచిస్తుంటారు. న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు సమాజాన్ని అభివృద్ది చేసేలా ఉండాలంటారు.

సంచలన తీర్పులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2014లో పదోన్నతి పొందిన జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ.. కీలకమైన అనేక అంశాలను విచారించిన ధర్మాసనాల్లో సభ్యులుగా ఉన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్‌ నిషేధం, సీజేఐ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవడం సహా ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణ వంటి కేసుల్లో కీలకంగా వ్యవహరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో చారిత్రక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో.. జస్టిస్‌ ఎన్.వి. రమణ సభ్యులు. ప్రజాప్రతినిధులపై సుదీర్ఘకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు.. జస్టిస్‌ రమణ ఆదేశాలు ఉపకరించాయి. ప్రస్తుత ప్రజాప్రతినిధులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ.. 2020 సెప్టెంబర్‌ 17న జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. అన్ని రాష్ట్రాల హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేసి.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సైతం.. సమాచార హక్కు పరిధిలోనే ఉంటుందంటూ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ ఎన్‌.వి. రమణ సభ్యులు. సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వర్సెస్ సుభాష్ చంద్ర అగర్వాల్-2019 కేసులో.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు పరిధిలోకి వస్తుందని అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ దీపక్ గుప్తా, జస్టిస్‌ సంజీవ్ ఖన్నాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
మహిళా సాధికారత, సమానత్వం
ముఖ్యంగా మహిళా సాధికారత, సమానత్వ సాధన దిశగా జస్టిస్‌ ఎన్‌. వి. రమణ ఇచ్చిన తీర్పులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇంట్లో గృహిణులు చేసే పని కార్యాలయాల్లో వారి భర్తలు చేసే పనికి ఏమాత్రం తీసిపోదంటూ.. ఈ ఏడాది మొదట్లో జస్టిస్‌ ఎన్‌. వి. రమణ, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం.. ఇచ్చిన తీర్పుతో మహిళాలోకంలో.. హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కుటుంబసభ్యుల కోసం నిరంతరం కష్టించే గృహిణుల శ్రమను గుర్తించి గౌరవించే విషయంలో.. ఆర్థికంగా ఆ శ్రమవిలువను నిర్ధరించడానికి ఏళ్లుగా అనుసరిస్తున్న విధానంలోనూ మార్పులు రావాల్సి ఉందన్నది జస్టిస్‌ రమణ అభిప్రాయం. ముఖ్యంగా.. వాహన ప్రమాదాల పరిహారం చెల్లింపు విషయంలో గృహిణుల శ్రమను, కుటుంబసభ్యులకు వారి సేవల విలువను అంచనా వేయటంలో లోపాలను సరిచేయాల్సి ఉందన్నది ఆయన భావన.

Advertisement

తాజా వార్తలు

Advertisement