Thursday, May 2, 2024

Inter Results 2024: ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లానే టాప్

ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఇవాళ‌ విడుదలయ్యాయి. ఉదయం 11గంటలకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం, సెకండియర్ ఫలితాల్లో 78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. ఫస్టియర్ ఫలితాల్లో 84శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 81శాతంతో గుంటూరు జిల్లా రెండోస్థానం, 79శాతంతో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి.

అలాగే సెకండియర్ ఫలితాల్లోనూ కృష్ణా జిల్లానే టాప్ లో నిలిచింది. 90 శాతం పాస్ పర్సెంటేజీతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా.. 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు రెండో స్థానంలో, 84 శాతంతో విశాఖ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. ఈ క్రమంలో విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకోవాలని సూచించారు. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు మే 24నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 10,53,435 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 5,17,570 మంది ఉండగా.. సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,35,865 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు బోర్డు వివరించింది. ఈనెల 4వ తేదీలోపే మూల్యాంకనం పూర్తి చేసింది. కాగా.. విద్యార్థులు పరీక్షల ఫలితాలను https://resultsbie.ap.gov.inలో చెక్ చేసుకోవచ్చు. త్వరలో ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బోర్డు 22 రోజుల్లోనే ఇంటర్ పరీక్షల ఫలితాలను వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement