Saturday, May 18, 2024

టీడీపీ, జనసేన పొత్తుల్లో కీలక అడుగులు.. రెండు, మూడు రోజుల్లో టీడీపీ సమన్వయ కమిటీ

అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య పొత్తులు ఖరారైన నేపథ్యంలో అతి త్వరలో మరో కీలక అడుగు పడనుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ టీడీపీతో పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో ఇరు పార్టీలు ఉమ్మడి కార్యాచరణపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ ఏర్పాటుపై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే టీడీపీ, జనసేన శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అంశంలో టీడీపీ పిలుపునిచ్చిన రిలే ని రాహార దీక్షల్లో సైతం జన సైనికులు పాల్గొంటున్నారు.

ప్రస్తుతం విపత్కార పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మనో ధైర్యాన్ని నింపేందుకు సీనియర్‌ నేతలను రంగంలోకి దింపింది. మరోవైపు ఆ పార్టీ యువనేత లోకేష్‌ ప్రతి అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ నేతలకు, కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. సీనియర్లతో మంతనాలు జరుపుతూ పార్టీ భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించి దాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లి పర్యటనలో ఉన్న నారా లోకేష్‌ అక్కడ ఎంపీలతో కలిసి చంద్రబాబు అరెస్ట్‌ అంశాన్ని జాతీయ స్థాయి నేతల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఆయన ఢిల్లి నుంచి తిరిగివచ్చిన వెంటనే సీనియర్లు మరోసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జనసేనతో పొత్తులు, సర్దుబాట్లకు సంబంధించి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ సారధ్య బాధ్యతలను సీనియర్‌ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడుకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే కమిటీ నియామకాన్ని పూర్తిచేసి జనసేనతో పొత్తుల అంశంపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. తాజాగా సీనియర్‌ నేత యనమల రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిశారు.

- Advertisement -

ములాఖత్‌ సమయంలో భువనేశ్వరి, బ్రాహ్మణీలతో కలిసి చంద్రబాబును కలిసిన యనమల పలు అంశాలపై చర్చించినట్లుగా విశ్వసనీయ సమాచారం. దాదాపు 10 నిమిషాలకు పైగా చంద్రబాబుతో యనమల ఏకాంతంగా రాజకీయ అంశాలపై మాట్లాడినట్లు సమాచారం. ఈ సందర్భంగా అరెస్ట్‌ అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరి ణామాలు, పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్ర మాలను యనమల చంద్రబాబుకు వివరించారు.

ముఖ్యంగా పార్టీ శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కోల్పోకుండా పకడ్బంధీగా వ్యవహరించాలని ఆ బాధ్యతలను పార్టీ సీనియర్‌ నేతలందరూ తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా జనసేనతో పొత్తుల అంశంపై కూడా ఈ ఇరువురు నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లి పర్యటన నుంచి లోకేష్‌ తి రిగి వచ్చిన అనంతరం జనసేనతో పొత్తులపై చర్చించేందుకు కో – ఆర్డినేషన్‌ కమిటీని వేయాలని ఆలోచించినట్లుగా విశ్వసనీయ సమాచారం.

ఉమ్మడి కార్యాచరణను రూపొందించి ఆ దిశగా అధికార వైసీపీపై పోరాటానికి కేడర్‌ను సిద్ధం చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అలాగే పలు పార్టీ కార్యక్రమాల నిర్వాహణ, ఇతర అంశాలపై యనమలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల్లోనే పొత్తులపై టీడీపీ సమన్వయ కమిటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement