Friday, May 17, 2024

బ‌ద్వేల్ వైసిపి ఎమ్మెల్యే వెంక‌ట సుబ్బ‌య్య క‌న్నుమూత‌

బ‌ద్వేలు – బ‌ద్వేల్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఎమ్మెల్యే వెంకట సుబ్యయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయ‌న మృత‌దేహానికి రేపు బ‌ద్వేల్ లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ హాజ‌రుకానున్నారు.. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్‌ వెంకట సుబ్బయ్య కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1960లో జన్మించిన వెంకట సుబ్బయ్య ఆర్థోపెడిక్ సర్జన్‌గా ప్రజలకు సేవలందించారు. 2016లో ఆయన బద్వేల్‌ వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. 2019లో తొలిసారిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ఓబులాపురం రాజశేఖర్‌పై 44 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాగా, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ జి.వెంకట సుబ్బయ్య మృతిపట్ల పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. ఇక వెంకట సుబ్బయ్య మృతి పట్ల వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు సంతాపం తెలిపారు. వైద్యుడిగా, ఎమ్మెల్యేగా వెంకట సుబ్బయ్య సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, కడప ఇంచార్జ్ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వెంకట సుబ్బయ్య మృతి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి తీరనిలోటు అని తెలిపారు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైఎస్సార్‌సీపీ వెంకట సుబ్బయ్య కుటుంబానికి అండగా ఉంటుందని మంత్రి చెప్పారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి అత్యంత బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2014లో వైఎస్సార్‌సీపీ ద్వారానే వెంకట సుబ్బయ్య రాజకీయ రంగప్రవేశం చేశారని గుర్తు చేసుకున్నారు. పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉండేవారు అని చెప్పారు. 2019 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారని పేర్కొన్నారు. వెంకట సుబ్బయ్య ఆత్మకు శాంతి కలగేలా భగవంతున్ని ప్రార్థిస్తున్నాని ఆళ్ల నాని పేర్కొన్నారు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement