Thursday, May 2, 2024

Jinnah Tower: బీజేపీకి వైసీపీ ఝలక్.. జిన్నా టవర్‌‌పై జాతీయ జెండా

గుంటూరులో ఉన్న జిన్నా టవర్‌‌కు పేరు మార్చాలంటూ బీజేపీ రచ్చ చేస్తున్న సంగంతి తెలిసిందే. స్వాతంత్రానికి పూర్వమే నిర్మించిన ఈ చారిత్రక కట్టడాన్ని కూల్చి వేస్తామని హెచ్చరించింది. అయితే, బీజేపీ వ్యూహానికి వైఎస్సార్సీపీ నేతలు చెక్ పెట్టారు. తాజాగా జిన్నా టవర్ విషయంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిన్నా టవర్ విషయంలో ఎలాంటి వివాదం తలెత్తకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిన్నా టవర్‌‌కు జాతీయ జెండా రంగులు వేశారు.

అంతేకాదు రేపు(ఫిబ్రవరి 3) జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ ద్వారా జిన్నా టవర్ పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచి పోతుందని మేయర్ కావటి మనోహర్ నాయుడు అభిప్రాయపడ్డారు. జిన్నా టవర్‌‌కు ఆ పేరు మార్చే ప్రసక్తే లేదంటూ తమ అధిష్టానం తీర్మానం చేసిందని కూడా ఆయన స్పష్టం చేశారు. 

జాతీయ జెండాను ఎగురవేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా తెలిపారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించడానికి మంగళవారం టవర్‌ను సందర్శించిన ముస్తఫా.. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) మత ఘర్షణలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. స్వాతంత్య్ర పోరాటంలో ముస్లిం పెద్దలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, కొంతమంది ముస్లింలు దేశం విడిచి పాకిస్తాన్‌లో స్థిరపడ్డారని అన్నారు. కానీ, మేము మా దేశంలో భారతీయులుగా కొనసాగాలని కోరుకన్నామని, మేము మా మాతృభూమిని ప్రేమిస్తాము అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కాగా, టవర్ పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ మరోసారి కొత్త నామకరణం చేసింది. పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ ట్వీట్ చేశారు. “జిన్నా టవర్‌కి త్రివర్ణ పతాకం వేయడం వల్ల మీ గుండె రంగు మారదు, వైఎస్ జగన్ దురదృష్టవశాత్తు, ఇప్పటికీ చంద్రవంకతో ఆకుపచ్చగా ఉంది. ప్రజల డిమాండ్‌ను గమనించండి & జిన్నా టవర్ పేరు మార్చండి’’ అని పేర్కొన్నారు. నకిలీ లౌకిక, జాతీయ వ్యతిరేక శక్తులపై బిజెపి సాధించిన విజయంగా కుమార్ దీనిని అభివర్ణించారు. జిన్నా పేరు తొలగించి, డాక్టర్ అబ్దుల్ కలాం లేదా శ్రీ గుర్రామ్ జాషువా పేరు పెట్టే వరకు బిజెపి & జాతీయవాద శక్తులు విశ్రమించవని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement